తుపాను చాలా తీవ్రంగా ఉంది:వాతావరణశాఖ
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ హుదూద్ తుపాన్ కాస్తా పెను తుపాన్ గా మారడంతో ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇది మరింత బలపడి ఉప్పెనుగా మారే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో విశాఖ జిల్లాతో పాటు, తీరం వెంబడి ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, తూ.గో జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలతో పాటు గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శనివారం మధ్యాహ్నం 12 గం.ల ప్రాంతంలో విశాఖ పరిసరాల్లో తీరాన్ని దాటుతుందని పేర్కొంది. ఒక రెండు చోట్ల కుంభవృష్టిగా వర్షం పడే అవకాశం ఉందని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
తుపాను తీరందాటే సమయంలో 140-150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ వేగం ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. సముద్రపు అలలు సాధారణ ఎత్తు కంటే 2. మీ వరకూ ఎగిరిపడే అవకాశం ఉందన్నారు. తుపాను తీరం దాటే సమయంలో ఉప్పెన మాదిరిగా అలలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. తుపాన్ ప్రభావంతో కమ్యూనికేషన్లు, రోడ్లు, రైల్వే వ్యవస్థలకు తీవ్రం అంతరాయం కలిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మత్య కారులు ఎవరు కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. తుపాను ఎట్టి పరిస్థితుల్లోనూ దిశ మార్చుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. దాదాపు 100-120 కి.మీ విస్తీర్ణంలో భారీగా విధ్వంసం జరిగే ఆస్కారం ఉందన్నారు.