
రంజాన్‌కు భారీ ఏర్పాట్లు
చార్మినార్/బహదూర్‌పురా/సాక్షి, సిటీబ్యూరో: ఈద్-ఉల్-ఫితర్‌ను ఘనంగా జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రార్థనలను పురస్కరించుకుని ఈద్గాలను ము స్తాబు చేస్తున్నారు. పాతబస్తీలోని మీరాలం, మాదన్నపేట్, గోల్కొండ, సికింద్రాబాద్‌లోని ఈద్గాలతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఆ యా ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాతబస్తీ మీరాలం ఈద్గాను అన్ని హంగులతో ప్రార్థనలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.
పండుగరోజు ఆంక్షలు..
సామూహిక ప్రార్థనల దృష్ట్యా మీరాలం ఈద్గా తదితర ప్రాంతాల్లో పండుగ రోజు ట్రాఫిక్ ఆం క్షలు విధించనున్నారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించనున్నారు. మీరాలం ఈద్గా క్రాస్ రోడ్డు నుంచి ఈద్గా వైపు ఎటువంటి వాహనాలను అనుమతించరు. శివరాంపల్లి, ఎన్‌పీఏ నుంచి బహదూర్‌ఫురా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హట్స్ టీ జంక్షన్ నుంచి అలియాబాద్ వైపు దారి మళ్లిస్తారు.
బ్యాగులు, సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు వద్దు: డీసీపీ
ఈద్గాలో సామూహిక ప్రార్థనలకు వచ్చే ముస్లిం లు తమ వెంట బ్యాగులు, సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులు తీసుకు రాకూడదని దక్షిణ మండలం డీసీపీ ఎస్‌ఎస్ త్రిపాఠీ కోరారు. ఈద్గా వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించిన అనంతరమే సామూహిక ప్రార్థనలకు అనుమతిస్తామన్నారు.
ఈద్గాల అభివృద్ధి: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలోని ఈద్గాలను అభివృద్ధి పరిచేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈద్-ఉల్-ఫితర్‌ను పురస్కరించుకొని పాతబస్తీ మీరాలం ఈద్గాను ఆదివారం ఉదయం ఆయన జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తాడ్‌బన్ మీరాలం ఈద్గాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు.
మీరాలం ఈద్గా ముఖద్వారం వద్ద శాశ్వత కమాన్, మీరాలం ఈద్గా లోపల శాశ్వత షెడ్‌ను త్వరలో నిర్మిస్తామన్నారు. ఆయన వెంట బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజాం ఖాన్, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రత్యూమ్నా, పోలీసు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ అధికారులు, కార్పొరేటర్లు మహ్మద్ మోబీన్, ఎంఏ గఫార్, అజీజ్ బేగ్, టీఆర్‌ఎస్ బహదూర్‌పురా నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌ఏ ఖైసర్, మహ్మద్ అబ్దుల్ గఫార్ ఖాన్ తదితరులు ఉన్నారు.