జనసంద్రంగా మదనపల్లె | huge crowd at sharmila speech | Sakshi
Sakshi News home page

జనసంద్రంగా మదనపల్లె

Published Wed, Sep 4 2013 3:23 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

huge crowd at sharmila speech

 మదనపల్లె, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రతో మదనపల్లె జనసంద్రంగా మారింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణంలో ఎటు చూసినా వేలాదిగా జనసందోహం కన్పించింది. నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సిన బహిరంగసభ మూడన్నర గంటల ఆలస్యంగా రాత్రి ఏడున్నరకు ప్రారంభమైనా జనం ఎంతో ఓపికతో ఎదురుచూశారు. షర్మిల చేసిన ప్రసంగానికి జనం మంత్రముగ్ధులయ్యారు. నేను జగనన్న పూరించిన సమైక్య శంఖారావాన్ని, మదనపల్లె వాసులు చూపిస్తున్న అభిమానం మరువలేనిది అనగానే ఆమెకు చేతులు ఎత్తి జనం అభివాదం చేస్తూ పూల వర్షం కురిపించారు.
 
 సభ ప్రాంగణం మొత్తం పూలతో నిండిపోయింది. సభప్రాంగణంలోనే విశేష జనవాహిని మధ్య షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. మహానేత పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారని ఆయన మరణానంతరం రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిగా మారిందన్నారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబునాయుడు కుట్ర పన్ని తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, నేడు ఆత్మగౌరవ యాత్ర చేపట్టడం సమంజసం కాదని, అది ఆత్మవంచన యాత్ర అని విమర్శించారు. చంద్రబాబుకు నిజం చెప్పితే తల వెయ్యి ముక్కలు అవుతుందని ముని శపించారని అందుకే ఆయన నిజం చెప్పరని ఎద్దేవా చేయగా జనం హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రం సమైక్య ఉద్యమాలతో తగలబడుతుంటే  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులను గబ్బిలాల్లాగా పట్టుకుని వేలాడుతున్నారని, వారు వెంటనే రాజీనామా చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేదికాదని చెప్పారు.
 
 అడుగడుగునా స్వాగతం
 షర్మిల చేపట్టిన యాత్ర సభాప్రాంగణం మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో మైనారిటీలు అడుగడుగునా పూల వర్షాన్ని కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement