షర్మిల ‘సమైక్య’ వాణి | Sharmila 'unified' voice | Sakshi
Sakshi News home page

షర్మిల ‘సమైక్య’ వాణి

Published Wed, Sep 4 2013 2:34 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Sharmila 'unified' voice

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ షర్మిల సమైక్య శంఖరావం రెండో రోజు బస్సు యూత్రకు  జనం జేజేలు పలికారు. సభల్లో జనం నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. మంగళవారం ఉదయం చిత్తూరు పీసీఆర్ సర్కిల్‌లో, పలమనేరు, మదనపల్లెలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మహానేత వైఎస్ తరహాలో బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేసిన ప్రతి సందర్భంలో జనం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘మీ రాజన్న కూతురుని, జగనన్న చెల్లెల్ని’ అంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా షర్మిల ఉపన్యాసం ప్రారంభం కావడంతో జనం కేకలు, ఈలలు వేస్తూ ఆనందాన్ని వ్యక్తంచేశార  .
 
 సాక్షి, తిరుపతి:షర్మిల బస్సుయూత్ర సభల ప్రసంగంలో ఎక్కువగా సమైక్యవాదం వినిపిస్తూ, విడిపోతే వచ్చే నష్టాలను వివరించారు. ఆద్యంతం ఉత్సాహపూరితంగా, ఉద్యమ స్ఫూర్తితో యూత్ర సాగింది. చిత్తూరు సభలో షర్మిల మాట్లాడుతూ  వైఎస్ మృతి చెందిన నాలుగేళ్లకు  కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయం కోసం ఈ రాష్ట్రన్ని అతలాకుతలం చేసి కుక్కలు చింపిన విస్తరిగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ప్రజలు కరతాళధ్వనులతో కేకలు వేస్తూ స్పందించారు. కృష్ణా, గోదావరి జలాలు సీమాంధ్రకు రాకపోతే ఏడారిగా మారుతుందని, రాష్ట్ర విభజన జరిగితే ఈ పరిస్థితి తప్పదని అనడంతో, జనం కూడా అవును, నిజమే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందంటూ ప్రతిస్పందించారు. మహానేత ప్రారంభించిన 108, 104 పథకాలు అదృశ్యమైయ్యాయని, ఆరోగ్యశ్రీకి జబ్బు చేసిందని,  కొత్తగా రేషన్ కార్డులు, ఫించన్‌లు ఒక్కటిగా కూడా మంజూరు కాకపోగా, ఉన్నవాటిని తీసేసారని అన్నప్పుడు జనం నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. రాష్ట్రంలో ఐదేళ్లు విద్యుత్, బస్సు చార్జీలు రూపాయి కూడా పెంచకుండా, ధరలు పెరగకుండా పేదలు, సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నప్పుడు సభ చప్పట్లతో దద్దరిల్లింది.
 
  చంద్రబాబు ఆత్మగౌరవం పేరుతో వెన్నుపోటు యాత్ర నిర్వహిస్తున్నారని, ప్రజలను మోసం చేసి బ్లాంక్ చెక్ లాగా కాంగ్రెస్‌కు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన ఆయనను మీరు తరిమికొట్టాలన్నప్పుడు జనం నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగానూ, ప్రతిపక్ష నాయకుడుగాను ఈ రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమి లేదని దుయ్యబట్టారు.   ప్రతిపక్షపార్టీలు  అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈగ వాలనివ్వకుండా చూసుకున్నారన్నారు.  కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని అధికార దాహంతో గొడ్డలితో నిలువునా నరికేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలన్నదే వైఎస్సార్‌సీపీ విధానమని, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నప్పుడు  చప్పట్లతో, ఈలలతో సభా ప్రాంతాలు దద్దరిల్లాయి. వైఎస్ బతికి ఉండి ఉంటే రాష్ట్ర విభజన అంశం వచ్చేది కాదన్నప్పుడు, జనం నుంచి ‘అవును విభజన జరిగేది కాదు’ అంటూ ప్రతి స్పందన వ్యక్తమైంది.
 
 చిత్తూరు, మదనపల్లె సభలకు భారీగా జనం
 రెండవ రోజు షర్మిల బస్సు యాత్రకు చిత్తూరు, మదనపల్లెతో పాటు, షెడ్యూల్డ్‌లో లేని పుంగనూరు, పలమనేరుల్లో కూడా సాగింది. ఈ ప్రాంతాల్లో షర్మిలను  చూసేందుకు వందలాది మంది బారులు తీరారు. చిత్తూరు పూలే సెంటర్‌లో జరిగిన సభకు గంగాధరనెల్లూరు, పలమనేరు, బంగారుపాళెం, పూతలపట్టు, చిత్తూరు రూరల్, తవణంపల్లె, పాలసముద్రం, వెదురుకుప్పం, యాదమరి, గుడిపాల మండలాల నుంచి ట్రాక్టర్లు, వాహనాల్లో వచ్చారు. మదనపల్లెలో జరిగిన సభకు మదనపల్లె రూరల్, రామసముద్రం, నిమ్మనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, వాయల్పాడు మండలాల నుంచి జనం తరలివచ్చారు. షర్మిల రాకకు ముందే రెండు గంటల నుంచి ఆమె కోసం వేచి ఉన్నారు. దారి పొడవునా ‘జగనన్న ఎలా ఉన్నాడు, ఆరోగ్యం ఎలా ఉందని’ జనం అడిగారు. జగనన్న ఎప్పుడు జైలు నుంచి వస్తాడని ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 బాబు లేఖతో అమర్ మనస్తాపం
 మదనపల్లెకు వెళుతూ మార్గమధ్యంలో పలమనేరులో వేచి ఉన్న అభిమానులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ. ‘‘చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఇచ్చిన లేఖతో మనస్తాపం చెంది, ముఫ్పై ఏళ్లుగా టీడీపీలో ఉండిన మీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి బాబు ప్రయత్నిస్తుండడం ఆయనకు నచ్చలేదు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలదని భావించి పార్టీలో చే రారు. అలాంటి వ్యక్తిపై డబ్బు తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్లారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు’’ అంటూ ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement