అనంతపురం క్రైం : పెళ్లికని వె ళ్తే దొంగలు పడి ఇంటిని గుల్ల చేశారు. అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు రాజహంస రాయల్ రెజెన్సీలో బుధవారం అమ్మినేని భక్తవత్సల చౌదరి ప్రమీల దంపతులు నివాసం ఉంటున్న 307 ఫ్లాట్‌లో చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు.. స్థానిక ప్రధాన తపాలా కార్యాయంలో అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్‌గా భక్తవత్సల నాయుడు పని చేస్తున్నారు. బంధువుల వివాహానికి బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళం వేసి దంపతులిరువురూ మదనపల్లికి వెళ్లారు.
గురువారం ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అప్పటికే మెయిన్ డోరు తాళం చిలుకు హుక్కు పగులకొట్టి ఉండటంతో పాటు తాళం కనిపించలేదు. డోరు కూడా కొద్దిగా తీసి ఉంది. వారు గాభరాగా ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. బెడ్‌రూం కప్‌బోర్డు సేప్టీలాక్ తెరిచి ఉంది. అందులో భద్రపర్చిన బంగారు చైన్, కడియం, బ్రాస్‌లేట్, 3 ఉంగరాలు, లేడీస్ బ్రాస్‌లేట్ ఒకటి, చెంప చారలు, పాపిడి బిళ్ల, 6 గాజులు, లాంగ్‌చైన్, కెంపుల చైన్, జత కమ్మలతో పాటు అరకేజీ వెండి వస్తువులు మాయమయ్యాయి. సుమారు 30 తులాలున్న బంగారు నగలు, వెండిని దొంగలు దోచుకెళ్లారని బాధితులు లబోదిబోమన్నారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ముందు రోజు మరో ఫ్లాటులో చొరబడిన దొంగలు :
ఇదే అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ నంబరు 206లో రైల్వే ఉద్యోగి ఉంటున్నాడు. విధుల్లో భాగంగా ఆయన గుంతకల్లుకు వెళ్లాడు. అతని భార్య ఇంటికి తాళం వేసి ఊరెళ్లింది. బుధవారం సాయంత్రం ఈ ప్లాటు వాకిలి తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంట్లో ఎలాంటి వస్తువులు చోరీ కాలేదని పోలీసులు గుర్తించారు. అయితే ఆగంతకులు ఆ ఇంటికి వేసిన బీగం పగులకొట్టి పైఅంతస్తు(నాల్గో ఫ్లోర్)లో ఉన్న భక్తవత్సల చౌదరి ఫ్లాట్(307) సమీపంలో పడేశారు. త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ రోజు రాత్రి దాకా అపార్టుమెంట్‌లోనే గడిపారు.
పగలే దొంగలు పడ్డారా?
భక్తవత్సలనాయుడు ఇంట్లో పట్టపగలే చోరీ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అపార్టుమెంట్‌పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ అపార్టుమెంటుకు ఒకే గేటు ఉంది. ఎవరు రావాలన్నా, వెళ్లాలన్నార ఈ గేటు గుండానే వెళ్లాల్సి ఉంది. రాత్రికి గేటుకు తాళం వేసి ఉంటుంది. దీంతో రాత్రి పూట చోరీ జరిగేందుకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని, ఎవరైనా అపార్టుమెంట్ లోపలికి ప్రవేశించడం ఎలా సాధ్యపడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అపార్టుమెంటులో ఉన్న వారికి బాగా తెలిసిన వారి హస్తం కూడా ఈ చోరీలో ఉండొచ్చని అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. కొరవడిన పోలీసు నిఘా : ఇటీవల త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలు అధికమవుతున్నాయి. పోలీసు నిఘా కొరవడిందనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మొన్న రెవెన్యూ కాలనీ, ఎర్రనేల కొట్టాల ప్రాంతాల్లో ఇళ్ల ముందుంచిన కార్లలో వస్తువులు ఎత్తుకెళ్లారు. నిన్న సాయిబాబా గుడిలో స్వామివారి పాదాలు చోరీ అయ్యాయి. తాజాగా రాజహంస రెజెన్సీలో ఆగంతకులు చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
పెళ్లికెళితే ఇల్లు గుల్ల చేశారు..
Published Fri, Mar 6 2015 2:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement