సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక స్టాక్ యార్డులు, డిపోలు నిండుగా ఇసుక రాశులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా భారీగా పెరిగింది. 20 రోజుల క్రితం వరకూ రోజుకు సగటున 22 వేల నుంచి 23 వేల టన్నుల దాకా ఉన్న ఇసుక సరఫరా బుధవారానికి ఏకంగా 2.66 లక్షల టన్నులకు పెరిగింది. ఈనెల 13వ తేదీన ఇసుక సరఫరా 1.44 లక్షల టన్నులు, బుకింగ్ 37,789 టన్నులు ఉండగా.. బుధవారానికి సరఫరా 2.66 లక్షల టన్నులకు, బుకింగ్ 67,806 టన్నులకు చేరింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, ప్రజలకు అవసరమైనంత ఇసుక అందజేయడమే లక్ష్యంగా నవంబరు 14వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం అయ్యాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు.
వినియోగదారులకు 56,499.5 టన్నుల ఇసుక
ఇసుక వారోత్సవాలు ముగిసే సరికి ఇసుక సరఫరా లక్ష్యాన్ని రోజుకు సగటున రెండు లక్షల టన్నులకు చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించగా... అధికారులు కేవలం 48 గంటల్లోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌ల నుంచి 2.66 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేయగా.. 67,806 టన్నుల ఇసుక బుకింగ్ అయింది. ఇదే సమయంలో 56,499.5 టన్నుల ఇసుకను స్టాక్ యార్డులు/స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారులకు పంపించారు. ఇవి సాధారణ వినియోగదారులకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. బల్క్ బుకింగ్ చేసుకున్న వారికి అందించిన ఇసుక దీనికి అదనమని సంబంధిత అధికారులు తెలిపారు. ఇసుక వారోత్సవాలు గురువారంతో ముగియనున్నాయని చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు నిఘాను పటిష్టం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే స్టాక్ యార్డులు/రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని చెక్‌పోస్టుల వద్ద రాత్రిపూట కూడా పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాకు చెక్
ఏడుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు
చింతూరు (రంపచోడవరం): రాష్ట్రం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో 13 ఇసుక ర్యాంపులను అధికారులు గుర్తించారు. సరిహద్దుల వెంబడి ఏడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఇసుక అక్రమంగా తరలి వెళ్లకుండా చింతూరు మండలం చిడుమూరు సరిహద్దుల్లో, ఒడిశాకు తరలి వెళ్లకుండా చింతూరు మండలం కల్లేరులో చెక్‌పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రా నుంచి తెలంగాణకు అక్రమ రవాణాను అరికట్టేందుకు మేడువాయి, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, తునికిచెరువు, లక్ష్మీపురంలో చెక్‌పోస్టులు పెడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఈ నెల 24లోపు ఏడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్ డీఈ మోహనరెడ్డి సాక్షికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment