కర్నూలు(జిల్లా పరిషత్): వందల కొద్దీ ఎకరాల భూములు, నెలకు లక్షల కొద్దీ ఆదాయం.. సంరక్షణకు వర్కర్లు. ఒక గో సంరక్షణశాలకు ఇంతకాన్నా ఏం కావాలి. అందులోని గోవులను ఎంతో బాగా సంరక్షించవచ్చు. కానీ ఇందుకు విరుద్ధంగా ఉంది కర్నూలు నగరంలోని కిడ్స్‌వరల్డ్ సమీపంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా గో సంరక్షణశాల పరిస్థితి. ఆవులకు దాణా పెట్టకుండా కడుపుకాలుస్తున్నారు. అవి చనిపోయిన తర్వాత ఖననం చేయాల్సింది పోయి నిర్దయగా పేడదిబ్బల్లో పూడ్చివేసి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఈ గో సంరక్షణశాలను 40 ఏళ్ల క్రితం ప్రారంభించారు. గో సంరక్షణశాల చుట్టుపక్కల సినిమాథియేటర్, షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి నెలకు రూ.1లక్షకు పైగా అద్దెలు వస్తాయి.
పొలాల నుంచి ఏడాదికి రూ.2.5లక్షలకు పైగా కౌలు వస్తుంది. ఆవుల సంరక్షణకు ముగ్గురు వర్కర్లు, ఒక అటెండర్ పనిచేస్తారు. దేవాదాయ శాఖ నుంచి ఈవో కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ జేసే ఆస్తులు ఉన్నా ఇక్కడి ఆవులు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 400లకు పైగా ఉన్న ఆవులు, కోడెదూడలు ఉన్నాయి. వీటికి అద్దెలు, కౌలు ద్వారా వచ్చిన మొత్తంతో కొద్దిపాటి దాణా వేస్తున్నారు. దాతలు సైతం తమ వంతుగా గడ్డి, దాణాలను తెచ్చి పెడుతున్నారు. అయితే వందల కొద్దీ ఉన్న ఆవులకు దాతల సహకారం ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ఆవులు, దూడలు అర్ధాకలితో అనారోగ్యానికి గురై మృత్యువు పాలవుతున్నాయి.
పేడదిబ్బల్లోనే పాతిపెడుతున్నారు
ఇటీవల కాలంలో గోసంరక్షణశాలలో పదుల సంఖ్యలో ఆవులు మృత్యువు పాలైనట్లు సవృూచారం. సాధారణంగా ఇక్కడ ఆవులు చనిపోతే వాటికి శాస్త్రబద్దంగా అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ ఇక్కడి అధికారులు, సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గోశాలలోని పేడదిబ్బల్లోనే పాతిపెడుతున్నారు. వారం రోజులుగా మూడు ఆవులు, దూడలు చనిపోతే ఇలాగే చేశారు. సోమవారం సైతం ఓ లేగదూడ చనిపోతే దానిని పేడదిబ్బల్లో సగం వరకే పాతిపెట్టారు. దీంతో తల్లి ఆవు లేగదూడ వద్దకు వచ్చి గంటల కొద్దీ తచ్చాడుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు సాక్షికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గోసంరక్షణశాలలో అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై ఈవో కమలాకర్‌ను వివరణ కోరగా ప్రస్తుతం ఆవులు, దూడలు ఏవీ చనిపోలేదని, ఒక వేళ చనిపోతే బయటకు తరలించి గుంతలు తీసి పాతిపెడతామన్నారు. గోశాలలో ఆవులను పాతిపెట్టడం లేదని వివరణ ఇచ్చారు.
ఇదెక్కడి సంరక్షణ?
Published Wed, Sep 3 2014 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement
Advertisement