కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఇంతవరకు భూసేకరణ అంటే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. జీవనాధారం అయిన పొలాలను ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర వాటి కోసం ఎక్కడ బలవంతంగా లాక్కుంటారోననే భయం వెంటాడేది.
ఇప్పటికే ఎంతోమంది తమ విలువైన భూములను కోల్పోయినా తగిన పరిహారం అందక అల్లాడుతున్నారు. చాలా మంది కోర్టులకెక్కి తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపై ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించనుంది. రైతుల అంగీకారం లేకుండా భూములను సేకరించే అవకాశం లేదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇకనుంచి జరిగే భూసేకరణకు ఈ చట్టం వర్తించనుంది. జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు-నగరి, ఎస్‌ఆర్‌బీసీ సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు భూసేకరణ పెండింగ్‌లో ఉంది.
గతంలో ఇలా..
భూములు సేకరించిన తర్వాత జనరల్ అవార్డు ఇస్తారు. ఇందులో ఇచ్చిన పరిహారం రైతులకు నచ్చకపోతే సెక్షన్-18 ప్రకారం కోర్టుకు పోయే అవకాశం ఉంది. మరో విషయమేమంటే సెక్షన్-17 ప్రకారం రైతుల సమ్మతి లేకుండా బలవంతంగా భూములు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉండింది. ఇదే రైతుల కొంప ముంచుతోంది.
ప్రస్తుతం ఇలా..
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రైతుల సమ్మతి లేకుండా భూసేకరణకు ఎంతమాత్రం అవకాశం లేదు. భూములు సేకరించాలంటే మొదటి 80 శాతం రైతులు ఆమోదం తెలపాలి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. ఆ తర్వాతనే భూసేకరణలో ముందుకు వెళ్లాల్సి ఉంది. సేకరించిన భూములకు పరిహారాన్ని కూడా గణనీయంగా పెంచారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల విలువలు నమోదు అయి ఉంటాయి.
వివిధ అవసరాలకు సేకరించిన భూములకు మార్కెట్ విలువకు నాలుగు రెట్లు ఎక్కువ మొత్తంలో పరిహారం ఇస్తారు. అంటే సేకరించిన భూమి ఒక ఎకరా మార్కెట్ విలువ రూ.లక్ష ఉంటే రూ.4 లక్షల పరిహారం లభిస్తుంది. కొత్త చట్టం ద్వారా రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాల్సి ఉంది. రైతుల సమ్మతి లేకుండా భూసేకరణకు తావు లేదు. కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేదు. రైతు సమ్మతి తీసుకుని మార్కెట్ విలువకు నాలుగు రెట్లు ఎక్కువ పరిహారం ఇస్తుండటం వల్ల కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.
అంగీకారంతోనే భూసేకరణ
Published Thu, Jan 2 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement