యర్రగుంటపల్లి (చింతలపూడి) : క్షణికావేశం.. అన్యోన్యంగా ఉంటున్న భార్యాభర్తలను బలిగొంది. రెక్కలుముక్కలు చేసుకుని రాత్రింబవళ్లు కూలి పనులతో చెమటోడ్చి సంపాదిస్తున్న డబ్బును భర్త వ్యసనాలకు ఖర్చు చేస్తుండటాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. తనతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా తన మాట వినకపోవడంతో కలత చెందింది. ఇదే విషయమై మరోసారి గొడవ జరిగి భర్త డబ్బు తీసుకుని ఊరు వెళ్లిపోవడంతో మరింత వేదనకు గురైంది. దీంతో ఉరివేసుకుని తనువు చాలించింది. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన భర్త విగతజీవురాలై ఉన్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో తానూ బలవన్మరణానికి ఒడిగట్టాడు.
చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన వీరవెంకటలక్ష్మి (25)కి కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన కుప్పాల మంగారావు (30)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా వీరు యర్రగుంటపల్లి వచ్చి నివాసం ఉంటున్నారు. కేబుల్ కోసం గోతులు, కాలువ తవ్వకాలకు కూలి పనులకు భార్యభర్తలు వెళుతుంటారు. వీరికి ఏడేళ్ల వయస్సున్న కుమారుడు మురళి, ఐదేళ్ల కుమార్తె అంజలి ఉన్నారు.ఇదిలా ఉండగా భర్త మంగారావు వ్యసనాలకు బానిసై డబ్బు దుబారా చేస్తున్నాడని భార్య పలుమార్లు అతనిని వారించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వీరిద్దరి మధ్య ఇదే విషయంపై మరోసారి గొడవపడ్డారు. దీంతో భర్త మంగారావు ఇంట్లో రూ.ఐదువేలు తీసుకుని తన తల్లిదండ్రులు ఉంటున్న మర్లపాలెం వెళ్లాడు.
ఈ డబ్బును కూడా వ్యసనాల కోసమే తీసుకువెళ్లాడని మనస్తాపంతో శుక్రవారం తెల్లవారుఝామున భార్య వీరవెంకటలక్ష్మి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు చూసి భర్తకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న భర్త.. భార్య మృతదేహం చూసి చలించిపోయాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఇంట్లోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకున్నాడు. అక్కడే ఉన్న బంధువులు ఇది గ్రహించేలోగానే మంగారావు మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. వీఆర్వో ఇచ్చిన సమాచారంతో ఎస్సై వీఎస్ వీరభద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనాథలైన చిన్నారులు
తల్లిదండ్రులు మృతి చెందడంతో మురళి, అంజలి అనాథలయ్యారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వారిని దిక్కులేనివారిగా మార్చింది. ఇక తమ ఆలనాపాలనా ఎవరు చూస్తారన్న దిగులు ఆ చిన్నారుల్లో కనిపించింది. అమ్మానాన్న మృతదేహాలను చూసి తల్లడిల్లుతున్న ఆ పసి హృదయాలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. విగత జీవులై పడి ఉన్న తల్లిదండ్రుల వద్ద చిన్నారులను చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. భార్యభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భార్యాభర్తల ఆత్మహత్య
Published Sat, Dec 6 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement
Advertisement