
ఎస్.కోట సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న సరోజిని
శృంగవరపుకోట : కంటికి రెప్పలా కాపాడతానంటూ తాళి కట్టిన భర్త నిండు గర్భిణి అయిన భార్య కడుపుపై తన్ని కర్కశత్వాన్ని చాటుకున్నాడు. సంఘటనకు సంబంధించి ఎస్సై అమ్మినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో మొండివీధికి చెందిన గనివాడ ఈశ్వరరావుకు సీతంపేట గ్రామానికి చెందిన సరోజినితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 1,50,000 రూపాయల కట్నం ఇస్తామన్న సరోజిని కుటుంబీకులు రూ. 1,20,000 ఇచ్చారు.
మిగిలిన రూ.30 వేలు ఇవ్వాలని భర్త ఈశ్వరరావు, అత్త, మామలు తరచూ వేధిస్తుండేవారు. ఇదిలా ఉంటే సరోజిని భర్త ఈశ్వరరావు వేరొక వ్యక్తి బంగారు ఉంగరం తాకట్టుపట్టాడు. సదరు వ్యక్తి పదే పదే వచ్చి సొమ్ము తీసుకుని ఉంగరం ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో సరోజిని తన భర్తను ఉంగరం ఏంచేశావు. . ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీసింది.
దీంతో కోపోద్రిక్తుడైన ఈశ్వరరావు ఏడు నెలల గర్భిణి అయిన భార్య కడుపుపై తన్నాడు. విషయం తెలిసి సరోజిని తండ్రి, బావలు వచ్చి ఈశ్వరరావుతో పాటు అతని తండ్రిపై చేయి చేసుకున్నారు. సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త గనివాడ ఈశ్వరరావు, మామ రామకృష్ణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గర్భిణి సరోజిని ఎస్.కోట సీహెచ్‌సీలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment