
సాక్షి, గోస్పాడు: భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన మండల పరిధిలోని యాళ్లూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. యాళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌మహబూబ్‌బాషా(33)కి, శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన మాబూబీతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. షేక్ మహబూబ్‌బాషా గౌండా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల అతడు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య మాబూబీని, తల్లి మిస్కీన్‌బీని, పిల్లలను వేధింపులకు గురి చేసేవాడు. గురువారం రాత్రి కూడా ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డారు. భోజనం తర్వాత అందరూ నిద్రించారు. ఇదే అదనుగా భావించిన భార్య మాబూబీ.. భర్త తలపై రోకలి బండతో మోది హత్య చేసింది.
హత్య విషయం తెల్లవారే వరకు బయటకు పొక్కలేదు. ఇంట్లోనే ఉన్న మహబూబ్‌బాషా తల్లి మిస్కిన్‌బీ కూడా విషయాన్ని బయటకు చెప్పలేదు. పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, సీఐ విక్రమసింహా, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని, హత్యకు దారితీసిన వివరాలు సేకరించారు. భార్య మాబూబీ, తల్లి మిస్కిన్‌బీలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment