జలచౌర్యం | Hydro Data Theft | Sakshi
Sakshi News home page

జలచౌర్యం

Published Mon, Dec 30 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

Hydro Data Theft

పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంతానికి ప్రధాన జీవనాధారమైన పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) నీటితో అక్రమార్కుల పంట పండుతోంది. ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీటిని   అక్రమంగా  మళ్లించుకుంటున్నా.. ఇదేమని అడిగే అధికారులు లేకపోవడంతో కాలువ వెంబడి అక్రమ మోటార్లు వెలుస్తున్నాయి.
 
 హైలెవెల్ కెనాల్(హెచ్‌ఎల్‌సీ) పరిధిలో సుమారు 23కుపైగా చిన్న, చిన్న డిస్ట్రిబ్యూటరీ గేట్లు  ఉండటంతో  వాటిని ఎత్తి పంటలకు.. చెరువులకు నీటిని మళ్లించుకుంటున్నారు. కాలువ వెంబడి ఎక్కడ చూసినా అక్రమ ఆయకట్టుతో పంటలు  కళకళలాడుతుండగా.. పీబీసీ ఆయకట్టు భూములు నీరులేక వెలవెలబోతున్నాయి.  పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి అనంతపురం జిల్లాలోని    5వేల ఎకరాల ఆయకట్టు కలుపుకుని పులివెందుల నియోజకవర్గంలో 55వేల ఎకరాలతో కలిసి సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు ఉంది.  ఏనాడూ పూర్తి ఆయకట్టుకు నీరు అందిన దాఖలాలు చరిత్రలో లేవు.
 
 కాలువ వెంబడి మోటార్లతో జలదోపిడి
 కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఆంధ్రా కోటా కింద నీరు విడుదల చేస్తే హెచ్‌ఎల్‌సీ ద్వారా పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు రావాలంటే పెన్నా ఆహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మిడ్ పెన్నార్ రిజర్వాయర్ వద్దకు నీరు వచ్చిన తర్వాత అక్కడ  కేటాయింపుల ప్రకారం నీటిని విడుదల చేస్తారు. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి పెనకచర్ల, దుగ్గుపల్లె మీదుగా దాదాపు 72కి.మీ మేర  తుంపెర వరకు నీరు రావాల్సి ఉంది.  ఈ మధ్యలో సుమారు 23కుపైగా డిస్ట్రిబ్యూటరీ గేట్లు ఉన్న నేపథ్యంలో.. ఎప్పుడుపడితే అప్పుడు రైతులు ఎత్తేస్తున్నారు. దీంతో తుంపెర వద్ద నీటి ప్రవాహం తగ్గుతోంది.  
 
 రీడింగ్‌లో ఇది  స్పష్టమవుతోంది. ఇప్పటికే హెచ్‌ఎల్‌సీ అధికారులు లాసెస్ కింద 15శాతం కోత పెట్టి  నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో కాలువల్లో నీరు చౌర్యానికి గురవుతుండటం రైతును కుంగదీస్తోంది.  అంతటితో ఆగక మిడ్ పెన్నార్ తుంపెర వద్ద సుమారు 72కి.మీ మేర ఉన్న కాలువల్లోకి సుమారు 400కుపైగా మోటార్లు వేసి నీటిని అక్రమంగా తోడుకుంటున్నా.. ఇదేమని అడిగేవారు లేకపోవడం, అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పులివెందులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

 తుంపెర నుంచి సీబీఆర్ వరకు 150నుంచి 200 అక్రమ మోటార్లు  
 తుంపెర నుంచి సీబీఆర్‌కు వచ్చే నీటికి సంబంధించి అధికారులు తుంపెర వద్ద రీడింగ్ తీసి కేటాయింపులు చేస్తున్నారు. తుంపెర, సీబీఆర్ మధ్య సుమారు 25కి.మీ మేర పీబీసీ కాలువ ఉంది. తుంపెర నుంచి గంగనపల్లె, రామాపురం, కునుకుంట్ల, ముచ్చుగుంటపల్లె, పాలెం, చిన్నకొండాయపల్లె, పెద్దకోట్ల తదితర గ్రామాల వద్ద ఎక్కడ చూసినా అక్రమ ఇంజన్లు, మోటార్లు, పైపులే దర్శనమిస్తున్నాయి. పైగా పీబీసీ నీటితో సాగు చేస్తున్న పంటలు కళకళలాడుతున్నాయి.  కాలువ వెంబడి ఏదో అరుతడి పంటలు కాదు.. వరి పంటను దర్జాగా సాగు చేస్తున్నారు.  అనంతపురం జిల్లాలోని తాడిమర్రి, నార్పల, యల్లనూరు మండలాల్లోని కొన్ని గ్రామాలకు చెందిన రైతులు యథేచ్చగా  నీటిని తోడేస్తున్నారు. ఒకటికాదు.. రెండు కాదు ఇక్కడ కూడా 150నుంచి 200మేర అక్రమ మోటార్లు ఉన్నట్లు పీబీసీ అధికారులకు తెలిసినా.. తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆయకట్టు రైతులు  ఆరోపిస్తున్నారు.  
 
 పీబీసీ వెంబడి పోలీసు పహారా అవసరం :
 పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి మొదటి విడతగా ఆగస్ట్ 16వ తేదీనుంచి నీటిని విడుదల చేశారు. రెండవ విడతగా డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేశారు. మొదట్లో నీరు 100క్యూసెక్కులనుంచి ప్రారంభమై ఇప్పుడు 470నుంచి 500క్యూసెక్కుల వరకు విడుదలవుతున్నాయి. తుంపెర నుంచి అక్రమంగా నీరు పోకుండా ఉండాలంటే పోలీసు పహారా అవసరమని ఆయకట్టు సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.  నీరు విడుదల చేసినన్ని రోజులు ప్రత్యేకంగా ఒక పోలీసు మొబైల్ టీంను పెట్టి అక్రమంగా నీటిని తరలించకుండా చూస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
 
 గడువు దాటినా టీబీసీకి నీరు..
 తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ)కు సంబంధించి గడువు దాటినా నీటిని మాత్రం అధికారులు విడుదల చేస్తూనే ఉన్నారు. కేటాయించిన నీటి కంటే  ఎక్కువగానే అందించినట్లు తెలుస్తోంది. టీబీసీకి సంబంధించి సింగనమల చెరువుతోపాటు తాడిపత్రి పరిధిలోని పలు చెరువులకు, ఆయకట్టు రైతులకు నీరు అందుతున్న నేపథ్యంలో ఒక మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి నీటిని విడుదల చేయిస్తున్నారు.
 
 ప్రస్తుతం కూడా 50క్యూసెక్కుల చొప్పున  జనవరి 10వ తేదీవరకు నీటిని విడుదల చేయనున్నారు.  పుట్లూరు మండలానికి చెందిన కొంతమంది రైతులు కూడా రెండు రోజులక్రితం తుంపెర వద్ద ఉన్న పీబీసీకి చెందిన కొంతమంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, లష్కర్లతో గేట్లు ఎత్తి టీబీసీకి ఎక్కువ నీటిని విడుదల చేయాలని డిమాండు చేసినట్లు కూడా తెలియవచ్చింది.
 
 అక్రమ నీటిని అరికట్టండి  
 పీబీసీకి వస్తున్న నీటిని అక్రమంగా వాడుకోకుండా చర్యలు చేపట్టాలి.  పులివెందుల రైతుకు సంబంధించి అన్నో.. ఇన్నో వస్తున్న నీటిని ఇతరులు మోటార్లు, పంపుల ద్వారా తీసుకెళితే.. మా పరిస్థితి ఏమిటి.. అక్రమ మోటార్లను తొలగించి పులివెందుల రైతుకు పీబీసీ నీటిని విడుదల చేయాలి.     
 - చప్పిడి రమణారెడ్డి,
 ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడు
 
 అక్రమ కనెక్షన్లు నిజమే
 పీబీసీ నీటిని అక్రమంగా వాడుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చింది.  అక్కడక్కడ అక్రమ కనెక్షన్లు ఉన్న మాట వాస్తవమే.. అక్రమ కనెక్షన్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం.. ఈ మధ్యనే 30నుంచి 40 కనెక్షన్లు తొలగించాం. త్వరలోనే మిగతా వాటిని తొలగిస్తాం.
 - రాజశేఖర్,పీబీసీ ఈఈ, పులివెందుల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement