అలా రాసేవారికి సిగ్గుండాలి: కిరణ్
హైదరాబాద్: పార్టీ మారుతారని వచ్చిన వార్తలపై జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను పార్టీలు మారుతానని రాసేవారికి సిగ్గుండాలని అన్నారు. బీజేపీలోకి కిరణ్ చేరుతారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
జై సమైక్యాంధ్ర పార్టీ వెబ్‌సైట్‌ను శనివారం కిరణ్ ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు. తాను బీజేపీలో చేరుతాననడం హాస్యాస్పదమని, అలా అనుకుంటే కాంగ్రెస్‌ను వీడేవాడిని కాదుకదా అని కిరణ్ చెప్పారు. కిరణ్ పార్టీలో చేరుతారని భావించిన కొందరు సీనియర్లు చేయివ్వగా, సమైక్యాంధ్ర పార్టీ నాయకులు కొందరు పార్టీ మారుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిరణ్ స్పందించారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కిరణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.