
వైఎస్సార్ సీపీలోనే ఉన్నా: ఎంపీ రేణుక
సాక్షి, న్యూఢిల్లీ: తాను వైఎస్సార్ సీపీలోనే ఉన్నానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీని వీడుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ఢిల్లీలోని ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘‘నేను టీడీపీలో చేరడం లేదు. చంద్రబాబుకు అభినందనలు తెలిపేందుకే వచ్చాను. నా నియోజకవర్గం అభివృద్ధికి వారి సహాయం అవసరం ఉంది. అందుకే ఆయన్ను కలిశాను. నేను టీడీపీకి కేవలం అసోసియేట్ సభ్యురాలిగానే కొనసాగుతాను. ప్రజలకు ఏదో మంచి చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాను. వెనుకబడిన కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఆ మాట నిలబెట్టుకునేందుకు చాలా నిధులు అవసరం’’అని రేణుక చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీగా గెలిచి టీడీపీ అసోసియేట్ సభ్యురాలిగా ఎలా కొనసాగుతారన్న విలేకరుల ప్రశ్నకు తాను ఆ విషయాలన్నీ ఆలోచించలేదంటూ సమాధానం దాటవేశారు. ఆమె భర్త టీడీపీలో చేరిన విషయమై ప్రశ్నించగా... తన వ్యక్తిగత అభిప్రాయం వేరని, తాను వైస్సార్‌సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. సాంకేతిక అంశాలపై తనకు అంతగా అవగాహన లేదన్నారు. ఒకవేళ పార్టీ అనర్హత వేటు వేస్తే మళ్లీ పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు... మళ్లీ పోటీ చేసే స్థోమత ఉంటే చేస్తాను, లేద ంటే సామాజిక సేవ చేసుకుంటానని సమాధానమిచ్చారు. టీడీపీకి అంశాల వారీగానే మద్దతు ఉంటుందన్నారు.