నా మద్దతు మోడీకే పరిమితం: పవన్
బీజేపీ సీమాంధ్ర నేత సోము వీర్రాజుకు లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘నా మద్దతు జాతీయ పార్టీలకే.. ప్రత్యేకించి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకే పరిమితం’ అని సినీ నటుడు, జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు ఆయన బీజేపీ సీమాంధ్ర నాయకుడు సోము వీర్రాజుకు ఆదివారం సాయంత్రం ఒక లేఖ పంపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ భేటీకి వీర్రాజు మధ్యవర్తిగా వ్యవహరించారు. ‘టీడీపీతో సహా ఏ ప్రాంతీయ పార్టీకీ మద్దతు ఇవ్వాలని నేను ఈరోజు వరకు నిర్ణయించుకోలేదు. లేనిపోని పుకార్లు వస్తున్న నేపథ్యంలో నేనీ విషయాన్ని స్పష్టం చేస్తున్నా. జనసేన, మోడీ మధ్య సత్సంబంధాలు పెంపొందాలని, అవి మరింత పటిష్టం కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న వీర్రాజుకు ఈ లేఖ అందిన వెంటనే ఆయన పవన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని తెలిసింది. ఈ లేఖ ఉద్దేశమేమిటో తెలుసుకునేందుకు ఆయన పవన్ సహచరులతో మాట్లాడారు. అయితే, ఇటువంటి వ్యవహారాల్లో తమ ప్రమేయం ఉండదని, నేరుగా పవన్‌నే సంప్రదించి విషయం తెలుసుకోవాలని సూచించారు. దీంతో ఆయన ఈ లేఖను ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేసి, పొత్తు వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీకి అందజేయాలని కోరినట్టు తెలిసింది.
27న విశాఖ సభలో ‘ఇజం’ పుస్తకావిష్కరణ: జన సేన పార్టీ స్థాపించిన రోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక నినాదం వినిపించిన పవన్‌కల్యాణ్.. యువతే లక్ష్యంగా ఈ నెల 27న విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రెండో సభను నిర్వహిస్తున్నట్లు ఆయన అభిమాన సంఘ నేతలు ప్రకటించారు. ఈ సభలోనే పవన్ పార్టీ సిద్ధాంతంగా రాసుకున్న ‘ఇజం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. విశాఖ సభపై జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.