సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వం ఆదేశిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీమంత్రి, నటుడు కృష్ణం రాజు తెలిపారు. తిరిగి మోదీయే ప్రధాని కావాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాననీ, ప్రజల్లో మోదీ పట్ల అనూహ్య మద్దతు పెరుగుతోందని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న కృష్ణం రాజు అనంతరం మీడియాతో మాట్లాడారు.
సేవకుడంటే మోదీలా ఉండాలని, ఆయన ప్రసంగం వింటే మరోసారి గెలిచినంత సంతోషంగా ఉందన్నారు. అగ్రవర్ణలకు 10 శాతం రిజర్వేషన్లపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. కొందరు మాత్రం నిధులు రావట్లేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మేరా బూత్ మాజ్బూత్ నినాదంతో..
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలతో కార్యకర్తలకు మార్గదర్శకం చేశారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోసం కూటమి కడుతున్న పార్టీలకు నాయకుడెవరనీ, మోదీకి సరితూగే నేత కూటమిలో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండా, నాయకత్వం లేని కూటమని విమర్శించారు. దేశంలో అవినీతిలేని పాలనను మోదీ అందిస్తున్నారనీ, మేరా బూత్ మాజ్బూత్ నినాదంతో ప్రతీ కార్యకర్త పార్టీని గెలిపించిందేకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
2014 ఫలితాలే పునారావృత్తం..
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. గతంలో కంటే రెట్టింపు ఉత్సహంతో పార్టీ శ్రేణులు ఉన్నారని, 2014 ఫలితాలే మరలా పునారావృత్తం అవుతాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికల గురించి సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. దేశం అభివృద్ధిలో వేగంగా సాగాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment