
రికార్డులు చూసి తప్పు ఎవరిదో నిర్ణయిద్దాం: స్పీకర్
హైదరాబాద్:అసెంబ్లీ రికార్డులు చూసి తప్పు ఎవరిదో నిర్ణయిద్దామని స్పీకర్ కోడెల శివప్రసాద రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా సోమవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో స్పీకర్ పై విధంగా స్పందించారు. అసెంబ్లీలో తనను తిట్టడమే కాకుండా.. మాట్లాడకుండా చేశారని రోజా స్పీకర్ కు వద్దకు తీసుకువెళ్లారు. దీంతో స్పీకర్ మాట్లాడతూ.. అసెంబ్లీ రికార్డులు ఆధారంగా తప్పు ఎవరిదో నిర్ణయిద్దామని తెలిపారు. సభాధిపతిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని కోడెల తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో నోటిదురుసు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై అభ్యంతకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దూషించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు. మహిళా ఎమ్మెల్యే రోజాపై వ్యక్తిగత దూషణలకు దిగారు. రోజా లేడీ విలన్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.దీంతో వాయిదా పడిన సభ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది. సభ ఆరంభమైన అనంతరం కూడా ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.