ఒత్తిళ్లు తట్టుకోలేకే తప్పుకొన్నా...
ఒత్తిళ్లు తట్టుకోలేకే నామినేషన్ ఉపసంహరించుకున్నా. సమైక్యాంధ్ర ఆకాంక్షను బలంగా వినిపించేందుకు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పోటీలో ఉండాలని భావించాను. మద్దతుగా నిలిచిన వారు తటపటాయించారు. మరో పక్క అధిష్టానంతో పాటు సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు కేంద్ర మంత్రులతో పాటు చివరకు సోనియా ప్రత్యేక సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. చివరి నిమిషంలో తప్పనిసరై నామినేషన్ ఉపసంహరించుకోవల్సి వచ్చింది.
- కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎమ్మెల్సీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘సమైక్యాంధ్ర’ పరిరక్షణ కోసమే రాజ్యసభ బరిలో నిలుస్తున్నానని, ఐటీ దాడులు, పోలీసు కేసుల బూచిని చూపినా రామబాణంలా వెనుతిరిగేది లేదని, ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు పన్నినా స్వతంత్రునిగా కదనం కొనసాగిస్తానని అన్న ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారా యణరాజు (చైతన్యరాజు).. కాంగ్రెస్ అధిష్టానంపై దూసింది నిజమైన కత్తి కాక కొయ్యకత్తేనని తేలిపోయింది. తన విజయంతో సమైక్యాంధ్రను పరిరక్షించుకుందామన్న ఆయన పలుకులు.. చివరికి ఉత్తర కుమార ప్రగల్భాలుగానే మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం వచ్చేసరికి రాజు గారిలోని ‘చైతన్యం’ ఎందుకో జావ కారిపోయింది. ‘నిజంగానే సమైక్యాంధ్ర కోసం మన జిల్లావాసి కంకణం కట్టుకున్నా‘రన్న ప్రజల మురిపెం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. సింహంలా గర్జించిన వ్యక్తి.. ఒక్కరోజు వ్యవధిలోనే తోకముడిచినట్టు.. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి కారణం.. ఆయన చెపుతున్నట్టు ఒత్తిళ్లతోనేనా, ఇంకా ఏమైనా జరిగిందా అన్న సందేహం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్యుల వరకూ అందరినీ వేధిస్తోంది.
పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరాన్ని వినిపించిన చైతన్యరాజు స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్న ప్రజల అభిమతాన్ని గుర్తించేలా అధిష్టానం కళ్లు తెరిపించేందుకు ఇదే సరైన సమయమని కూడా హుంకరించారు. చైతన్యరాజు, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి, రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, పలువురు ఒత్తిడి చేయడంతో బరిలోకి దిగుతారనుకున్న రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లలో ఒకరు మాత్రమే స్వతంత్రునిగా పోటీలో ఉంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మద్దతుతో గెలుపు సునాయాసమవుతుందన్న అంచనాలు వెలువడ్డాయి కూడా. దివాకరరెడ్డిని ఒప్పించి బరి నుంచి వైదొలగజేశారు. ఆదాల కూడా మడమ తిప్పుతారని, ఇక స్వతంత్రంగా బరిలో నిలిచే ఏకైక అభ్యర్థి చైతన్యరాజే అవుతారని, తద్వారా జిల్లా పేరు పెద్దల సభకు జరిగే ఎన్నికల్లో మారుమోగుతుందని అంతా ఆశించారు.
అంత మద్దతున్నప్పుడు.. మడమ తిప్పడమెందుకో?
జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప మిగిలిన 12 మంది మద్దతు తనకేనని, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 52 మంది అండతో గెలుపు ఖాయమని చైతన్యరాజు ధీమా వ్యక్తం చేశారు. మరి, అలాంటప్పుడు బరి నుంచి ఎందు కు తప్పుకోవాల్సి వచ్చిందో ప్రశ్నార్థకం. సీఎం కోటరీ నుంచి సానుకూల సంకేతా లు అందడంతోనే స్వతంత్రంగా బరిలోకి దిగడానికి చైతన్యరాజు సిద్ధపడ్డారని సమాచారం. అయితే చివరికి సీఎం కిరణే ఆయన బరి నుంచి వైదొలగేలా చేశారనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును తిరస్కరించామని గొప్పలకు పోయిన అధికారపార్టీ పెద్దలే చైతన్యరాజుకు కళ్లెం వేయడం వారి నైజానికి అద్దం ప డుతోందని పరిశీలకులంటున్నారు. తొలుత నామినేషన్ వేయించడం, ఆనక ఉపసంహరింప చేయడం అధిష్టానం వద్ద మార్కులు కొట్టే వ్యూహమేనని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద తామంతా ఒకే తాను ముక్కలమని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్పకనే చెప్పారు.
రాజు తొలగె.. చైతన్యం చెదరగ..
Published Sat, Feb 1 2014 3:09 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement