
విదేశాల్లో ఉన్నందువల్లే సమీక్షకు గైర్హాజరు
అద్దంకి : తాను విదేశాల్లో ఉన్నందువల్లే ఒంగోలులో గురువారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశానికి హాజరుకాలేకపోయానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నేను కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాను. సమావేశాలు జరిగే విషయం ముందుగా తెలియకపోవడం వల్ల రాలేకపోయానే తప్ప మరే కారణం లేదు. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశా.
నేను సమావేశానికి రాని విషయాన్ని సాకుగా చూపి..ఎందుకు రాలేదు? వేరే పార్టీకి వెళతారా అంటూ కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. అటువంటి అసత్య ప్రచారాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. బలమైన ప్రతిపక్షంగా ఉండి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సార థ్యంలో ప్రజల సమస్యలపై పోరాడతాం. మళ్లీ ప్రజల మన్ననలు పొంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం’ అని చెప్పారు.