అభ్యంతరాల్లేని అధికారుల విషయంలో జాప్యం వద్దు
ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపుపై కేంద్రానికి ఇరు రాష్ట్రాల విజ్ఞప్తి
కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ, తెలంగాణ సీఎస్‌ల నిర్ణయం
తెలంగాణ సచివాలయంలో భేటీ, పలు అంశాలపై చర్చ
కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలపై వివాదాల్లేవని ప్రకటన
హైదరాబాద్: అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులపై అభ్యంతరాలు లేని వారిని ఆయా రాష్ట్రాల కేడర్‌కు కేటాయిస్తూ తక్షణమే ఉత్తర్వులు ఇచ్చేలా కేంద్రానికి లేఖ రాయాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నిర్ణయించారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో సమావేశమైన ఇద్దరు సీఎస్‌లు ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ నెల 22న రోస్టర్ బ్యాండ్ పద్ధతిలో అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయించడం, ఆ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ తన వెబ్‌సైట్‌లో ఆ జాబితాను వెల్లడించిన విషయం విదితమే. ఏపీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ డాక్టర్ రాజీవ్ శర్మ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అధికారుల పంపిణీ చివరి తేదీ వరకు ఆగాల్సిన అవసరం లేదని వీరిద్దరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక కేటాయింపుల వల్ల ఆయా రాష్ట్రాల్లో పనిచేయడానికి అధికారులు ఇబ్బంది పడుతున్నారని, తాజా కేటాయింపులపై అభ్యంతరాలు లేని అధికారులను ఆయా రాష్ట్రాల కేడర్‌కు ఇచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరడానికి సిద్ధమయ్యారు. లేని పక్షంలో వర్క్ టు ఆర్డర్ ఉత్తర్వులైనా ఇవ్వాలని సూచించనున్నారు.
ఇక తమకు కేటాయించిన రాష్ట్రంలో పనిచేయడానికి ఇష్టపడని కొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ ఎస్ అధికారులు తాము పరస్ప ర అంగీకారంతో బదిలీ అవుతామని, అందుకు అనుమతించాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పరస్పర బదిలీలు కుదరవంటూ సీఎస్‌లు వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. భార్యాభర్తలను వేర్వేరు రాష్ట్రాలకు కేటాయించిన పక్షంలో మాత్రం వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలపై ఇరు రాష్ట్రాలకు ఎలాంటి వివాదాలు లేవని ఆంధ్రా సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విలేకరులతో అన్నారు. ఈ మార్గదర్శకాలపై ఇప్పటికే సంతకాలు చేసినట్లు చెప్పారు. రెండుమూడు రోజుల్లో ఇవి వెలువడనున్నట్లు, కేంద్రం ఆమోదానికి కూడా పంపనున్నట్లు సమాచారం.
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోండి
వ్యవసాయ విశ్వవిద్యాలయం, సచివాలయంలో దక్షిణ ద్వారం వద్దనున్న భవనాలను ఖాళీ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మను కోరారు. అయితే ఈ విషయంలో ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ అంశాలపై సీఎంతో చర్చించాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంశం సీఎంల స్థాయిలో పరిష్కారమైతే బాగుంటుందని రాజీవ్ శర్మ అన్నట్లు తెలిసింది. గవర్నర్ వద్ద జరిగిన ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలో నిర్ణయించిన మేరకు మరిన్ని అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సీఎస్‌లు అంగీకారానికి వచ్చారు.
వాళ్లను వెంటనే ఇవ్వండి
Published Wed, Aug 27 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement