
ఉద్యోగాలు ఊడబెరికారు
అర్ధంతరంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ల తొలగింపు
రమ్మని పిలిచి... ఊస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు
రోడ్డునపడిన 20 మంది..
నోటీసు లేదు... కారణం చెప్పలేదు... తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు...కానీ అర్ధంతరంగా 20 మంది ఐసీడీఎస్ సూపర్‌వైజర్ల ఉద్యోగాలు పీకేశారు. బాబు వస్తే జాబు వస్తాయని ఊదరగొట్టిన టీడీపీ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది. ఉత్తరాంధ్రలో 20 మంది సూపర్‌వైజర్లను అర్ధంతరంగా తొలగించడమే ఇందుకు తాజా తార్కాణం.
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఐసీడీఎస్‌లో 20 మంది సూపర్‌వైజర్లను ప్రభుత్వం అర్ధంతరంగా, అన్యాయంగా తొలగించింది. ఆఫీసుకు పిలిపించి ఏమీ చెప్పకుండానే చేతిలో ఓ ‘కవర్’ పెట్టారు. ఇంటికి వెళ్లి ఆ కవర్ తెరచి చూడమని పంపించివేశారు. అందులో ఏముందో తెలియక ఇంటికి వెళ్లి సూపర్‌వైజర్లు ఆ కవర్ తెరచి చూసి ఒ హతాశులయ్యారు. ‘మిమ్మల్ని సూపర్‌వైజర్లుగా తొలగించాం. కా వాలంటే మీ రు అంగన్‌వాడీ కార్యకర్తలుగా చేరొచ్చు. కానీ ఎక్కడ పోస్టింగో కూడా చెప్పలేం’అని అం దులో ఉంది. ఇలా ఎలాంటి కారణం చూపించకుండా త మను తొలగిచడంతో ఆ సూపర్‌వైజర్లు నిర్ఘాంతపోయారు. 2013లో ఉత్తరాంధ్రలో 237 ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పోస్టు ల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఎంపిక పరీక్షలో ర్యాం కుల ఆధారంగా అర్హులైన 159 మందికి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన పోస్టులు ఖాళీ గానే ఉన్నాయి. అలా ఎంపికైనవారు ప్రస్తుతం ప్రొబేషన్‌లో ఉన్నారు. మరో రెండు నెలల్లో వారి ఉద్యోగాలు పర్మినెంట్ అవుతయని వా రు ఆశిస్తున్నారు. ఉన్నఫళంగా 20 మంది సూపర్‌వైజర్లను ఉద్యోగాల నుంచి తొలగిం చారు. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని చెబుతూ వారిని తొలగిం చినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఎంపిక చేసిన ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం సూపర్‌వైజర్లను తొలగించడమేమిటో ప్రభుత్వానికే తెలియాలి.
సక్రమంగా ఎంపికైనా: సూపర్‌వైజర్లను అడ్డగోలుగా తొలగించినట్లు ప్రభుత్వ ఉత్తర్వులే వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు బి.నిర్మల అనే ఆమె విజయనగరం జిల్లా బాడంగి ఐసీడీఎస్ ప్రాజెక్టుపరిధిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఎంపిక జాబితాలో 130వ ర్యాంకు వచ్చిన నిర్మల కంటే మెరుగైన ర్యాంకు వచ్చినవారు ఉన్నందున ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ 2013లో ఎంపిక జాబితాలో ఆమెకు 124వ ర్యాంకు వచ్చింది. ఇష్టానుసారంగా ర్యాంకులను మార్చేసి ప్రభుత్వం వారిని తొలగించేసింది. బాధిత సూపర్‌వైజర్లు ఆర్జేడీని సంప్రదించగా కలెక్టర్ ఆదేశాల మేరకే వారిని ఉద్యోగాల నుంచి తొలగించామని చెప్పారు. కానీ ఆ ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా కలెక్టర్ ఆదేశాల ప్రస్తావనే లేదు.