
ఆదర్శ రైతులుగా తెలుగు తమ్ముళ్లు
దినుంచి అక్కసుతో ఉన్న చంద్రబాబు సర్కార్ అనుకున్నదే చేసింది. ఆదర్శరైతులను తొలగించాలని నిర్ణయించింది. ఈమేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానించింది.
సాక్షి, నెల్లూరు: ఆదినుంచి అక్కసుతో ఉన్న చంద్రబాబు సర్కార్ అనుకున్నదే చేసింది. ఆదర్శరైతులను తొలగించాలని నిర్ణయించింది. ఈమేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానించింది. అయితే ఆదర్శ రైతుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారనుకుంటే పొరపాటే. ఉన్నవారిని తొలగించి వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలను ఆదర్శ రైతులుగా నియమించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. క్యాబినెట్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో 29 వేల మంది ఆదర్శరైతులు పనిచేస్తుండగా జిల్లాలో 1224 మంది ఉన్నారు. 2006 నుంచి వీరు కొనసాగుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వం నియమించిందన్న అక్కసుతో ఉన్న చంద్రబాబు ఆదర్శరైతులపై అవకాశం వచ్చినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే అటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఇటు ఆదర్శరైతులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం హామీతో ఓట్లేయించుకున్న బాబు, అధికారంలోకి వచ్చాక విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నిర్ణయాల అమలు విషయంలో మొదట కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించిన బాబు సర్కార్ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు ఆదర్శరైతుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పింది. అయితే పట్టుమని పదిరోజులు గడవక ముందే ప్రస్తుతమున్న ఆదర్శరైతులను తొలగించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పారు. అయితే తొలి నుంచి ఆదర్శరైతుల వ్యవస్థను తప్పుపడుతూ ఆదర్శాలు వల్లిస్తూ వస్తున్న బాబు ఇప్పుడు అసలు రంగును బయట పెట్టుకున్నాడు. చంద్రబాబు నిర్ణయంపై ఆదర్శరైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.