బ్యాంకు ఖాతాలులేని కుటుంబాలను గుర్తించండి
చిత్తూరు (సెంట్రల్): మండల స్థాయిలో ఈ నెల 15వ తేదీ నుంచి జేఎంఎల్‌బీసీ సమావేశాలను నిర్వహించి బ్యాంకు ఖాతాలు ప్రారంభించని కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం ఆయన తన కార్యాలయంలోని సమావేశమందిరంలో నిర్వహించిన ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు.
మిషన్‌మోడ్ కింద సమగ్ర ఆర్థిక చేకూర్పును అమలు చేసే దిశగా బ్యాంకర్లు గ్రామస్థాయిలో క్యాంపులు పెట్టి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించేందుకు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలన్నారు. బ్రాంచ్ మేనేజర్లు మండలి స్థాయిలో ఎంపీడీఓల సమన్వయంతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో 15వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కొత్త బ్యాంకు బ్రాంచీలను ఏర్పాటుచేసి ఆర్థిక చేకూర్పుకు సహకరించాలన్నారు. ప్రభుత్వపథకాల్లో భాగంగా 2014-15 సంవత్సరానికి మెప్మా ద్వారా రూ.125 కోట్లు, రాజీవ్ యువశక్తి కింద రూ.6 కోట్లు ఆర్థిక చేకూర్పు చేయడానికి లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ 164లో రైతు కుటుంబానికి పంట రుణాలు, వ్యవసాయానికి బంగారు రుణాలను రూ.1.5లక్షల వరకు, డ్వాక్రా గ్రూపులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులు వేరుశెనగ పంటకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేలా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ చంద్రారెడ్డి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సుధాకరరావు, ఎల్‌డీఎం వెంకటేశ్వరరెడ్డి, ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ కిషన్‌ప్రసాద్, ఆర్‌బీఐ ఏజీఎం కులకర్ని, ఎస్‌బీఐ ఏజీఎం బ్రహ్మం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.