టీడీపీలో సీటు రావాలంటే ధన, కుల బలం ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వినపడుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా ఈ రెండు అర్హతలున్న వారికే ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలు లేకపోలేదు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీలో సీటు రావాలంటే ధన, కుల బలం ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వినపడుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా ఈ రెండు అర్హతలున్న వారికే ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలు లేకపోలేదు. ఏ రాజకీయపార్టీ అయినా ఎంపీ సీట్ల కేటాయింపు లో కొన్ని మినహాయింపులతో అభ్యర్థులను ఖరారు చేస్తుంది.
టీడీపీ అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు సీట్ల కేటాయింపులో ఒకే విధా నాన్ని అనుసరిస్తోంది. ధన, కుల బలాలను పరిగణలోకి తీసుకుంటోంది. జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎస్సీలకు రిజర్వుపోను మిగిలిన రెండు సీట్లు ఒకే సామాజిక వర్గానికి, స్థానికేతరులకు కేటాయించే దిశగా ఆ పార్టీనేత నారా చంద్రబాబునాయుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందిన గల్లా జయదేవ్‌కు ఖరారు అయిందనే అభిప్రాయం వినపడుతోంది.
తిరుపతికి చెందిన గల్లా జయదేవ్ ఆర్థిక వెసులుబాటు కలిగిన వ్యక్తి కావడంతో ఎన్నికల ఖర్చు తగ్గుతుందనే అభిప్రాయంతో అసెంబ్లీ సెగ్మంట్‌లోని నేతలున్నారు. గత ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచిన మోదుగుల వేణుగోపాలరెడ్డి రానున్న ఎన్నికల్లో వ్యక్తిగత కారణాల వల్ల ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో ఆ సీటునూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఖరారు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం పెమ్మసాని స్వస్థలం. గుంటూరులో మెడిసిన్ చేసిన తరువాత అమెరికాలో కార్డియాలజిస్టుగా స్థిరపడ్డారు. హైదరాబాదులో జరిగిన మహానాడులో పాల్గొన్న పెమ్మసాని నరసరావుపేట సీటుపై కన్నేశారు. పార్టీకి భారీగా విరాళం ఇచ్చి చంద్రబాబును ఆకట్టుకున్నారు. ఆ సామాజికవర్గం నేతలూ పెమ్మసానికి సీటు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకువచ్చారు. అధినేత సానుకూలంగా ఉండటంతో రెండుసీట్లు ఒకే సామాజికవర్గానికి, స్థానికేతరులకు కేటాయిస్తున్నట్లు అవుతోంది.
అసెంబ్లీ సీట్ల విషయంలోనూ...
అసెంబ్లీ సీట్ల ఖరారులోనూ ఇదే ధోరణి కనపడుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తూ ఆర్థిక వెసులుబాటును కొలమానంగా తీసుకుంటున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా వెన్నా సాంబశివారెడ్డి, చీరాల గోవర్ధనరెడ్డి, మన్నవ సుబ్బారావు, దాసరి రాజా మాస్టారులను పేర్కొంటున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు మంత్రికన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేసి ఓటమి పాలై ఆర్థికంగా చితికిపోయిన వెన్నా సాంబశివారెడ్డిని పార్టీ పూర్తిగా విస్మరించింది. 2004 ఎన్నికల్లో సీటు వస్తుందని ఆశపడిన సాంబశివారెడ్డిని పక్కనపెట్టి కొమ్మాలపాటి శ్రీధర్‌కు సీటు కేటాయించారు.
రానున్న ఎన్నికల్లోనూ సీటు కేటాయింపుపై సందేహాలు లేకపోలేదు. బాపట్లకు చెందిన చీరాల గోవర్ధనరెడ్డి పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. గత ఎన్నికల్లో 1300 ఓట్ల తేడాతో ఓడిపోయిన గోవర్థనరెడ్డిని పార్టీ పక్కన పెట్టి మద్యం వ్యాపారి అన్నం సతీష్ ప్రభాకర్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన మన్నవ సుబ్బారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం పనిచేస్తున్నా అతనికి ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రతీ ఎన్నికల్లో కాపులకు సీటు ఇస్తామని చెబుతున్న అధినేత గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గానికి ఒక్క సీటు కేటాయిం చలేదు. ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సామాజికవర్గానికి చెందిన దాసరి రాజా మాస్టారుకు సీటు ఇస్తామని హామీ ఇచ్చి చివర్లో రిక్తహస్తం చూపారు.
రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి రాజా మాస్టారు సీటు ఆశిస్తుంటే మైనార్టీ వర్గానికి చెందిన ఎంఏ హకీంకు సీటు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ సీటు ఇస్తామని హకీంకు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్న నేతలు అది కాస్తా గల్లా జయదేవ్‌కు కేటాయించడంతో తూర్పు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. పార్టీ కోసం పనిచేసినవారిని పక్కనపెట్టి కులం,ధన బలం ఉన్నవారికే సీటు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.