ఐఐటీకి స్థలాన్వేషణ
- జిల్లాకు ఐఐఎం, ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ!
- స్థలాలు గుర్తించాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు
- నివేదిక తయారీలో అధికారులు నిమగ్నం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: విశాఖకు మహర్దశ పట్టనుంది. రాష్ర్ట విభజనతో జిల్లాకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయి. పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ మున్ముందు విద్యారంగంలో హైదరాబాద్‌కు దీటుగా తయారుకానుంది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీటితో పాటు గిరిజన విశ్వవిద్యాలయం కూడా జిల్లాలో ఏర్పాటయ్యే సూచనలున్నాయి. జిల్లాలో ఇందుకు అనువైన స్థలాలను గుర్తించి నివేదిక పంపించాలని ఉన్నత విద్యా శాఖ నుంచి సోమవారం కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు ఆదేశాలు అందాయి. గిరిజన యూనివర్సిటీ కోసమని స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నా జాతీయ విద్యా సంస్థల విషయంలో ఐఐటీ, ఐఐఎంలా? లేదా ఇతర విద్యా సంస్థలా?.. ఎన్ని?.. అవేమిటి? ..అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.
దీర్ఘకాల డిమాండ్
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో విశాఖ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కానీ విద్యారంగంలో మాత్రం ప్రతిష్టాత్మక, జాతీయ స్థాయి విద్యా సంస్థలు లేకపోవడం లోటుగా పరిణమించింది. ఫలితంగా ఉన్నత విద్యతో పాటు ఉద్యోగావకాశాల కోసం యువత హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచపటంలో గుర్తింపు పొందిన విశాఖలో ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా దీర్ఘకాలంగా ఉంది.
కనీసం విశాఖలో ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలన్న ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. వీటిపై జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా ప్రాతినిథ్యం వహించిన వారంతా సిఫార్పులు చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు స్థలాన్వేషణ చేయాలంటూ ఉన్నత విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు రావడంతో విశాఖ వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
రెండు రోజుల్లో నివేదిక
ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయో రెవెన్యూ అధికారులు గుర్తించి వాటికి ప్రహరీలు కూడా నిర్మించారు. వాటి రికార్డుల ఆధారంగా జాతీయ విద్యా సంస్థలకు అనువైన స్థలాలను రెండు రోజుల్లో గుర్తించి నివేదిక తయారు చేయనున్నారు. ఐఐటీ, ఐఐఎం విద్యా సంస్థలకు 400 నుంచి 500 ఎకరాల స్థలం అవసరముంటుంది.
అదే గిరిజన యూనివర్సిటీకి 30 నుంచి 50 ఎకరాల స్థలం సరిపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి స్థలం ఏజెన్సీకి దగ్గరలో ఉండలా? లేదా గ్రామీణ ప్రాంతంలో చూడాలా? అన్న విషయంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీని కోసం రెండు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి నివేదిక తయారు చేయాలని భావిస్తున్నారు.
తుది నిర్ణయం ఉన్నత విద్యా శాఖ తీసుకుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఎన్ని? అవేమిటన్న విషయాన్ని స్పష్టం చెప్పకపోవడంతో నాలుగైదు ప్రాజెక్టులకు అవసరమయ్యే అనువైన స్థలాలను గుర్తించి నివేదికలు తయారుచేసి ఈ వారంలోనే ఉన్నత విద్యాశాఖకు పంపించనున్నట్టు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు.
దీర్ఘకాల డిమాండ్ కావడం, రాష్ట్ర విభజన జరగడం, కేంద్ర ప్రభుత్వం హామీల నేపథ్యంలో తప్పకుండా ఐఐటీ లేదా ఐఐఎంలలో ఏదో ఒకటి త్వరలోనే జిల్లాకు మంజూరవుతుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. విశాఖలో ఐఐఎం, విజయవాడలో ఐఐటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.