
ముస్లింలకు వైఎస్సార్‌సీపీ అండ
- ఎంపీ వరప్రసాదరావు
- ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా
న్యూఢిల్లీ: ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లే ఏపీలో కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్లను పెంచాలని కోరారు. ముస్లిం ఐక్య వేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏపీలో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.
ధర్నాకు మద్దతు పలికిన వరప్రసాదరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని, విద్య, ఉద్యోగ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. ముస్లింల ఐక్య వేదిక సంఘం అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన ముస్లింలను ఆదుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ సభ్యునికి కూడా స్థానం కల్పించకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ధర్నాలో సంఘం రాష్ట్ర కార్యదర్శి మౌలాన ఆరీఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.