మనసు గెలిచిన నేత.. మదినిండా ప్రేమే | Muslim minorities spoke emotionally with YS Jagan At Muslims Meet | Sakshi
Sakshi News home page

మనసు గెలిచిన నేత.. మదినిండా ప్రేమే

Published Thu, Sep 13 2018 4:00 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

Muslim minorities spoke emotionally with YS Jagan At Muslims Meet - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దగాపడ్డ ప్రతి ముస్లిం బిడ్డకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే అండాదండన్న అభిప్రాయం విశాఖ కేంద్రంగా జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో స్పష్టమైంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు ఉద్విగ్న భరితంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మోసపూరిత వాగ్దానాలతో నాలుగున్నరేళ్లుగా నష్టపోయిన వైనాన్ని కళ్లకుకట్టారు. మహిళలు సైతం చంద్రబాబు చేస్తున్న మోసాలపై నిప్పులు చెరిగారు. జగన్‌ అధికారంలోకి వస్తేనే మంచి రోజులొస్తాయని ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రతి ముస్లిం బిడ్డా నడుం బిగుస్తుందని భరోసా ఇచ్చారు.  

కట్టలు తెంచుకున్న ఆవేశం: ‘మీ కోసమే వచ్చాను. మీ మనసులో మాట చెప్పండంటూ...’ పలకరించిన జననేత మాటలు ముస్లిం మైనార్టీల గుండెను తాకాయి. ఆ ఆత్మీయతలో ఉప్పొంగిన ముస్లిం సోదరులు కన్నీటి పర్యంతమై మనసులోని బాధను విన్పించడం సభను మరింత వేడెక్కించింది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన జరీనా గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేదన సభా స్థలిలో ప్రతీ ముస్లిం మైనార్టీ సోదరుడిని కంటతడి పెట్టించింది. ‘అణిచి వేస్తున్నారన్నా.. హక్కులడిగితే తరిమి కొడుతున్నారు. దేశ ద్రోహులంటూ ముద్రేస్తున్నారు. కేసులు పెట్టి వేధిస్తున్నారు. జైళ్లకు పంపి బతుకులతో ఆడుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో నిత్యం వెంటాడే అనుభవాలన్నా.. మా బతుకుల్లో వెలుగు రావాలంటే మీరు సీఎం కావాలి. మిమ్మల్ని ముఖ్యమంత్రి చెయ్యాల్సిన అవసరం మాకుంది’ అంటూ ఆమె  జగన్‌ ముందు బావురుమంది. మైనార్టీ బతుకు చిత్రాన్ని జగన్‌ ముందుంచే క్రమంలో ఆక్రందన కన్పించింది. ఎస్సీ, ఎస్టీలకన్నా హీనంగా ఉన్నామన్నా.. లారీ, కారు డ్రైవర్లు, పొల్లాల్లో కూలీలు.. ఇలా హీనంగా బతుకుతున్న ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రతీ గొంతుక నినదించడం ఆత్మీయ సమ్మేళనంలో అందరి హృదయాలను బరువెక్కించింది. 

ప్రతీ నోట వైఎస్‌ మాట..
ముస్లిం మైనార్టీలతో వైఎస్‌ కుటుంబానికున్న అనుబంధాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ప్రతీ వ్యక్తి గుర్తు చేసుకున్నారు. ఆయనిచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్‌ వారి స్థితిగతుల్లో వెలుగు నింపిందన్న కృతజ్ఞత కన్పించింది. వైఎస్‌ చూపిన దయాదాక్షిణ్యాలతో అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్‌ అకౌంటెంట్లు.. పోలీసు అధికారులు అయ్యారంటూ చెబుతున్నప్పుడు వాళ్ల కళ్లలోంచి ఆనంద భాష్పాలు వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలో? జగన్‌ ఎందుకు సీఎం కావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన రిజర్వేషన్‌ సుప్రీం కోర్టు బెంచ్‌పై ఉందని, తమకు అన్యాయం జరిగితే పోరాడే శక్తి జగన్‌కే ఉందన్న నమ్మకం వారిలో కనిపించింది.

జగన్‌ హామీలే కొండంత బలం
పాదయాత్రలో వివిధ సందర్భాల్లో ముస్లిం మైనార్టీలకు జగన్‌ ఇచ్చిన ప్రతీ హామీ ముస్లిం సోదరుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. మౌజమ్‌లకు రూ.5 వేలు, ఇమామ్‌లకు రూ.10 వేలు ఇస్తామన్న భరోసా వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. దుల్హాన్‌ పథకం కింద ఇచ్చే రూ.50 వేలను, రూ. లక్షకు పెంచుతామన్న భరోసాను గుర్తుచేస్తూ జగన్‌ను ముస్లింలు గుండెల్లో పెట్టుకున్నారనేది ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్ఫుటమైంది. పేదరికాన్ని దూరం చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం.. ఆపదలో ఆదుకునే ఆరోగ్యశ్రీని ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ప్రస్తావించడాన్ని బట్టి వైఎస్‌ పాలన రావాలన్న బలమైన కాంక్ష వాళ్లల్లో ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. 

అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు..  
ప్రజా సంకల్ప యాత్ర 261వ రోజు బుధవారం అడుగడుగునా విశాఖ నగర వాసులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని లాసెన్స్‌బే కాలనీ, ఎంవీపీ కాలనీ, హనుమంతవాక, ఆరిలోవ, చినగదిలి వరకూ జననేత పాదయాత్ర కొనసాగింది. ఆద్యంతం ప్రజలు ఆయన్ను భారీ సంఖ్యలో వెన్నంటారు. మహిళలు, యువత, వృద్ధులు, ఉద్యోగులు, కూలీలు, మత్స్యకారులు.. అన్ని వర్గాల వారు ఆయన్ను కలిసి కష్టాలు చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో వినతి పత్రాలు సమర్పించారు. రాజకీయ కారణాల వల్ల మూసేసిన ఆముదాలవలస చక్కెర ఫ్యాక్టరీనీ తెరిపించాలని ఆ ప్రాంత రైతులు కోరారు. అందరి కష్టాలు ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.  

వైఎస్సార్‌ మెగా వైద్య శిబిరాల పోస్టర్‌ ఆవిష్కరణ 
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వైద్య విభాగం ఆధ్వర్యంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 100 మెగా వైద్యశిబిరాల ప్రారంభోత్సవ పోస్టరును బుధవారం విశాఖలోని ఆరిలోవ కూడలిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో డెంగీ, సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నందున వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జి.శివభరత్‌రెడ్డి తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచిందని, ఆరుమాసాలుగా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు మంత్రే లేడని, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి రావడం చంద్రబాబుకు సిగ్గు చేటన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement