
హామీలు అమలు చేయండి
తెలుగుదేశం పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు.
చిత్తూరు(సెంట్రల్): రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల వేళ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులు, డ్వాక్రా, అంగన్‌వాడీ, సహకార, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులతో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడారు.
ఎన్నికలకు ముందు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత, చేతి వృత్తులు, ఎస్సీ, ఎస్టీలు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడానికి నిబంధనలతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఆ హామీలు అమలు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కుమారరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భయంకరమైన కరవు పరిస్థితులు ఉంటే కేవలం 48 మండలాలను మాత్రమే కరవు ప్రాంతంగా ప్రకటించడం దారుణం అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేవలం ఏడు మండలాలకు పరిమితం చేయడానికి యత్నించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఉపాధికి గండి పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించాలనే ఆలోచన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పింఛన్లలో కోత విధించడానికే వయోపరిమితిని తగ్గించిందన్నారు. కరువు పరిస్థితుల్లో నీటి కోసం అలమటిస్తుంటే హంద్రీ-నీవాతో సమస్య పరిష్కారం చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సహకార రంగం, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకరించాలన్నారు. ఆ పార్టీ చిత్తూరు డివిజన్ కార్యదర్శి చైతన్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య, నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత, జయచంద్ర తదితరులు ప్రసంగించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.