రేషన్‌షాపుల్లో అమలు కాని పోర్టుబిలిటీ విధానం
ఇతర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలకు వెళ్తే సరుకులు ఇవ్వని వైనం
వలసదారులకు తప్పని ఇబ్బందులు
విజయనగరం కంటోన్మెంట్: ఈయన పేరు అంబటి మోహనరావు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్ర ముక్కాం గ్రామం. విధుల రీత్యా జిల్లాలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఆయన ప్రతి నెలా పక్క జిల్లాకు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వారు. వెళ్లిన రోజున ఏ సరుకులు ఉంటే అవే దిక్కు. మిగతా సరుకులు వదిలేయాల్సి వచ్చేది. ‘ఈ-పాస్’ వచ్చాక పోర్టుబిలిటీ పద్ధతిలో సరుకులను తీసుకోవచ్చని అధికారులు చెప్పడంతో తనకు శ్రమ తప్పినట్లేనని అతను భావించాడు. అయితే, అతని ఆనందం ఎంతసేపూ నిలవలేదు. ఇక్కడి రేషన్ షాపులకు వెళ్లి అడిగితే ఎవరూ సరుకులను ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు తిరిగినా పోర్టుబిలిటీ లేదన్న సమాధానమే డీలర్ల నుంచి వస్తోంది.
ఈ సమస్య మోహనరావు ఒక్కరిదే కాదు. జిల్లాలో చాలామందికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లా నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం కొన్ని నెలల పాటు ఉండిపోయి కూలి పనులు చేసుకుంటున్నారు. అక్కడయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చని అనడంతో వారంతా రేషన్ కార్డులు పట్టుకెళ్లి అక్కడి షాపుల్లో సరుకులు అడిగితే.. డీలర్లు కాదు పొమ్మంటున్నారు. రేషన్ షాపులు, సరుకుల పంపిణీ విధానం మొత్తం ఈ-పాస్ ద్వారా చేపడుతున్నామని, ఇక నుంచి అర్హులైన లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులను తీసుకోవచ్చని చెప్పిన యంత్రాంగం.. ఇప్పుడు ఆ విధానాన్ని అమలు చేయడంలో విఫలమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఈ పోర్టుబిలిటీ విధానం అమలు కావడం లేదు. ముఖ్యంగా జిల్లాలోని ఇతర మండలాల నుంచి వచ్చి జిల్లా కేంద్రంలో ఉన్నవారికి కూడా ఈ విధానం అమలు కావడం లేదు.
స్వంత జిల్లా పరిధిలోనే ఈ విధానం పనిచేయకపోతే.. ఇక ఇతర ప్రాంతాల్లో పరిస్థితి మాటేంటని రేషన్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 6.90 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో సుమారు లక్షకుపైగా వినియోగదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొంతమంది వలసదారులు.. ఇళ్ల వద్ద చిన్నారులు, వృద్ధులను వదిలి వెళ్తుంటారు. అటువంటి వారికి ఎటువంటి సమస్యా ఉండదు. కొత్తగా పెళ్లయి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, కుటుంబం మొత్తం జిల్లా కేంద్రాల్లో ఉంటున్న వారికి ఈ పోర్టుబిలిటీ విధానం ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ విధానం ఎక్కడా అమలు కాకపోవడంతో వారందరికీ నిరాశ తప్పడం లేదు.
సమస్యను పరిష్కరిస్తున్నాం..
పోర్టుబిలిటీ విధానంలో సరుకులను ఇచ్చినప్పుడు ఇతర జిల్లాల్లోని రేషన్ షాపుల్లో తరుగు చూపుతోంది. కానీ కార్డుదారుని సొంత షాపులో మాత్రం తరుగు చూపకుండా ఉంది. దీనివల్ల కార్డుదారుడు సరుకును తీసుకోనట్టే చూపిస్తోంది. ఈ సాంకేతిక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. జిల్లా పరిధిలో మాత్రం ఈ సమస్య లేదు. ఒక వేళ డీలర్ ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం.
- పి.నాగేశ్వరరావు, డీఎస్‌ఓ
ఈ-పాస్.. అంతా తు్‌స్!
Published Thu, Apr 28 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement
Advertisement