కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రచ్చబండ ముగిసింది. మొదటి, రెండో విడతలతో పోలిస్తే ఈసారి వినతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అధికారులు వీటికి ప్రాధాన్యమివ్వకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఈనెల 11న ప్రారంభమైన మూడో విడత రచ్చబండ మంగళవారంతో ముగియగా.. అర్బర్, రూరల్ ప్రాంతాల్లో నిరాశే మిగిలింది మొత్తం 69 సమావేశాలు నిర్వహించారు. రచ్చబండ అనగానే ప్రజల్లో ఎన్నో ఆశలు. ప్రధానంగా రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు తదితరాలు మంజూరు చేస్తారనే నమ్మకం ఉండేది. అయితే అధికారులు వారి ఆశలను నీరుగారుస్తూ కార్యక్రమాన్ని ప్రచారానికే పరిమితం చేయడం విమర్శలకు తావిస్తోంది. మొదటి రెండు రోజులు దరఖాస్తులు తీసుకోకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఆ తర్వాత దరఖాస్తులను తీసుకున్నా వాటిని పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు.
కల్లూరు అర్బన్ కాలనీల్లో నిర్వహించిన రచ్చబండలో స్వీకరించిన వినతులను గోనెసంచిలో కట్టి అక్కడే పడేసి వెళ్లడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఇక ఈ విడతలో అధికార పార్టీ మద్దతుదారులకే అధికంగా ప్రయోజనం చేకూర్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయంలో పలు గ్రామ సభల్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. రేషన్ కార్డులకు 1.15 లక్షల దరఖాస్తులు అందగా.. అత్యధికంగా ఆదోని అర్బన్‌లో 9,647, నంద్యాల అర్బన్‌లో 9వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కర్నూలులో ఈ సంఖ్య 5 వేలకు మించలేదు. రచ్చబండలో వినతులు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమైంది. పింఛన్లకు 43,104.. పక్కా ఇళ్లకు 89,166 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
రెండో విడత రచ్చబండతో పోలిస్తే 50 శాతం పైగా వినతులు తగ్గిపోయాయి. 86వేల రేషన్ కార్డులను రచ్చబండలో పంపిణీ చేయాల్సి ఉండగా 58వేలు, పింఛన్లు 27,381 పంపిణీ చేయాల్సి ఉండగా 22,185, పక్కా ఇళ్లు 70,810 పంపిణీ చేయాల్సి ఉండగా 52వేలు మాత్రమే పంపిణీ చేయడం గమనార్హం. చివరిరోజు మంగళవారం ఆత్మకూరు అర్బన్, రూరల్‌లో రచ్చబండ సభలు ఏర్పాటయ్యాయి. మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి సూచన మేరకు ఆత్మకూరు అర్బన్‌కు 90, రూరల్ మండలానికి 200 అంత్యోదయ అన్నయోజన కార్డులను కలెక్టర్ మంజూరు చేశారు.
నిరాశే మిగిలింది
Published Wed, Nov 27 2013 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement