కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య కుటుంబాల సంఖ్యను ఎప్పుడో దాటిపోయింది. తాజాగా రచ్చబండ లో జారీ చేసిన కార్డులతో కలిపి 7.74 లక్షలకు చేరిం ది. అయినా రేషన్ కార్డులు లేని కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కార్డుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న కుటుంబాలెన్నో.. రచ్చబండలో రేషన్‌కార్డుకోసం 49,746 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో రచ్చబండకు ముందు 7.01 లక్షల రేషన్‌కార్డులు ఉండేవి. మూడో విడత రచ్చబండలో 73,454 మందికి తెలుపు రంగు రేషన్‌కార్డులు మంజూరు చేస్తూ కూపన్లు పంపిణీ చేశారు.
బోగస్ కార్డులతో బొక్క..
జిల్లా జనాభా 25 లక్షలు దాటింది. 5,93,234 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యకన్నా ఎక్కువగా రేషన్‌కార్డులను జారీ చేయడం గమనార్హం. తెలుపురంగు కార్డులపై ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యంతో పాటు, 9 రకాల సరుకులను సబ్సిడీపై అందిస్తోంది. కందిపప్పు, గోధుమపిండి, గోధుమలు, చక్కెర, ఉప్పు, కారంపొడి, చింతపండు, పసుపు, పామాయిల్ వంటి 292 రూపాయల విలువైన వస్తువులను 185 రూపాయలకే సరఫరా చేస్తోంది. బోగస్ రేషన్‌కార్డుల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా బొక్కపడుతోంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. చాలా చోట్ల రేషన్ డీలర్ల వద్ద బోగస్ కార్డులున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే బోగస్ కార్డులు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోం దన్న ఆరోపణలున్నాయి. ఇటీవల మాచారెడ్డిలో జరిగిన రచ్చబండ సభలో రేషన్‌కార్డు, బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఓ పేద కుటుంబం వచ్చింది. దరఖాస్తులు స్వీకరించే చోట రద్దీ ఎక్కువగా ఉండడం తో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఊపిరాడక వారి ‘బంగారుతల్లి’ మరణించింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం బోగస్ రేషన్ కార్డులను ఏరివేసి, అర్హులకు కార్డులు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
నవ్విపోదురుగాక..
Published Sat, Nov 30 2013 5:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement