చర్చకు దారితీసిన ‘నైట్ డామినేషన్’పై ఎంపీ వ్యాఖ్యలు
కేశినేని మాటల వెనుక
ఆంతర్యంపై అధికారుల ఆరా?
పార్కింగ్ స్థల వివాదంలో పోలీసులు
సహకరించలేదని గుర్రు!
మంత్రి ఉమాకు సీపీ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆగ్రహం!
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు చేపట్టిన ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’పై ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) చేసిన వ్యాఖ్యలు కమిషనరేట్‌లో కలకలం రేపాయి. గతంలో అధికార పార్టీకి చెందిన ఓ న్యాయవాది ఆపరేషన్ నైట్ డామినేషన్ తనిఖీలపై హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసి స్టే వెకేట్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఎంపీ కూడా ఇదే అంశంపై వ్యతిరేకంగా మాట్లాడటం చర్చనీ యాంశంగా మారింది. ప్రభుత్వ విధానాల్లో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యలపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై పోలీసు వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు కమిషనర్ నగరానికి వచ్చిన తర్వాత చర్చించి కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించాలని పలువురు సీనియర్ అధికారులు భావిస్తున్నారు.
‘నైట్ డామినేషన్’పై స్టే
‘రాజధాని సేఫ్ సిటీ’ కార్యక్రమంలో భాగంగా నేరగాళ్ల ఏరివేత కోసం గత నెల 16వ తేదీన పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి ఏ విధమైన గుర్తింపు పత్రాలు లేని వారి కంటిపాపలు, వేలి ముద్రలు సేకరించారు. పోలీసుల తనిఖీల్లో పలువురు పాత నేరస్తులు దొరికారు. ఈ సమయంలో నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తానికొండ చిరంజీవి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు నైట్ డామినేషన్ తనిఖీలపై స్టే విధించింది. ఇదే సమయంలో చట్టానికి లోబడి భద్రతాపరమైన చర్యల్లో భాగంగా పోలీసులు చేసే పనులు కొనసాగించాలని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టులో స్టే వెకేట్ చేయించేందుకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ సాగుతుండగానే ఎంపీ కేశినేని నాని కూడా సీపీ చర్యలను తప్పుబడుతూ వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది.
ఆంతర్యమేంటి?
పోలీసు కమిషనర్‌ను ఉద్దేశించి ఎంపీ చేసిన వ్యాఖ్యల వెనుక ఇతర కారణాలు ఉండొచ్చనే అభిప్రాయాన్ని కమిషనరేట్‌లోని పలువురు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా అధికారులు ఆరా తీస్తున్నారు. తన కార్యాలయం పక్కన పార్కింగ్ స్థలం వివాదం సమయంలో పోలీసులు తనకు అనుకూలంగా వ్యవహరించలేదని ఎంపీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. స్థలం ఖాళీ చేయకుంటే రెండు వర్గాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు ఇచ్చిన నివేదిక కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖాళీ చేయించినట్టు సమాచారం. మరోవైపు తాను చేసే సిఫార్సులను బుట్టదాఖలు చేస్తున్న సీపీ.. మంత్రి దేవినేని ఉమాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా కేశినేని ఆగ్రహానికి మరో కారణమని సమాచారం.
కమిషనరేట్‌లో కలకలం
Published Sat, Dec 27 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement