సాక్షి, కడప: ఇటీవల నిర్వహించిన రచ్చబండలో 50 యూనిట్లలోపు కరెంటు వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు, పాతబకాయిల మాఫీ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎస్సీ, ఎస్టీల పాత బకాయిలు మాఫీ చేసేసినట్లుగా ప్రకటించారు. 50 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు సరఫరా కూడా అమల్లోకి వచ్చిందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పాతబకాయి కూడా మాఫీ కాలేదు. 50 యూనిట్ల లబ్ధి కూడా దరిచేరలేదు. పేరుకే రాయితీ పరిమితమైంది.
ప్రభుత్వం ప్రకటించినా...
సబ్‌ప్లాన్(ఉప ప్రణాళిక) నిధులతో ఎస్సీ, ఎస్టీలకు గత మార్చి వరకు ఉన్న పాతబకాయిలన్నింటినీ మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా జూన్ నుంచి 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకానికి పైసా చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. జిల్లాలో 6.45 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
వీరిలో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారనే లెక్కను ఇప్పటి వరకూ ఎస్‌పీడీసీఎల్ అధికారులు తేల్చలేదు. విద్యుత్‌శాఖ, సాంఘిక సంక్షేమశాఖల నడుమ సమన్వయం కొరవడటంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని తెలుస్తోంది. సాంఘిక సంక్షేమశాఖ నుంచి ఒక్క రూపాయి నిధులు విడుదల కాలేదని కరెంటోళ్లు చెబుతుంటే.. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వివరాలు తమకు ఎస్‌పీడీసీఎల్ అధికారులు అందజేయలేదని సాంఘిక సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు.
రూ. 97లక్షలు నిధులు మంజూరైనా
ఈ ఏడాది మార్చి వరకూ ఎస్సీ, ఎస్టీల పాత బకాయిలు మాఫీ చేసేందుకు సబ్‌ప్లాన్ కింద 97లక్షల రూపాయల నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. వీటిని విద్యుత్‌శాఖకు సర్దుబాటు చేయకుండా సాంఘిక సంక్షేమశాఖలకు విడుదల చేశారు. నేరుగా పాతబకాయిలు మాఫీ చేయకుండా కుల ధ్రువీకరణ పత్రం మెలిక పెట్టారు. సర్వీస్‌కు సంబంధించిన వివరాలు, కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తేనే పాత బకాయిలు మాఫీ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఎస్సీ, ఎస్టీ సర్వీసులు, కులధ్రువీకరణ పత్రాలు తీసుకుని వాటిని ఆన్‌లైన్ చేసిన తర్వాత ఉచిత విద్యుత్ అమలు జాబితాలోకి వినియోగదారులు వస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి ఎంతకాలం పడుతుందో తెలీని పరిస్థితి. దీంతో బకాయిలు మాఫీ అయిపోయాయయని సంతోషపడిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నెత్తిన బకాయిల కత్తి వేలాడుతూనే ఉంది.
50 యూనిట్లకు రాయితీ ఏది?
ఈ ఏడాది జూన్ నుంచి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకం ఉచితమని ప్రకటించినా ఇప్పటి వరకూ ఒక్కరికీ రాయితీ సర్దుబాటు కాలేదు. జూన్ నుంచి నవంబర్ వరకూ 50 యూనిట్లలోపు విద్యుత్ వాడిన వారి వివరాలు కూడా లేవు. తాజా బకాయిల వారి నుంచి 50 యూనిట్ల రాయితీని మినహాయిస్తామని చెప్పినా ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. 50 యూనిట్లకు ఒక్కటి మించినా ఉచిత విద్యుత్తు పథకానికి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అర్హత కోల్పోతాయి. ఒక బల్బు, టీవీ, ఫ్యాన్ ఉన్న కుటుంబం పొదుపుగా కరెంటు వాడితే 50 యూనిట్లు ఖర్చవుతుంది. ఇవి కాకుండా మరో బల్బు పెరిగినా 50 యూనిట్ల అంకె దాటుతుంది.
అందుకే 50 యూనిట్లకు మించకుండా బడుగులు కరెంటును వాడుకోవాల్సిన పరిస్థితి. ఒక్కో ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి నెలకు 50 యూనిట్ల చొప్పున ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్తు వాడకానికి రాయితీ అందిస్తే ఎక్కువ కుటుంబాలకు మేలు జరుగుతుందని కొందరు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
మాకు సరైన గణాంకాలు
ఇవ్వలేదు: పీఎస్‌ఏ ప్రసాద్, జేడీ, సోషియల్ వెల్ఫేర్.
జిల్లాలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉన్నారనే వివరాలను ఎస్‌పీడీసీఎల్ అధికారులు కచ్చితమైన వివరాలను అందజేయలేదు. కొన్ని అందజేసినా అవి తప్పులుగా ఉన్నాయి. దీంతో మేం నిధులు విడుదల చేయలేకపోయాం. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సంబంధించి సరైన గణాంకలను అందిస్తే మేం నిధులు విడుదల చేస్తాం:
కచ్చితమైన వివరాలు అందలేదు: గంగయ్య, ఎస్‌ఈ, ఎస్‌పీడీసీఎల్
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఎంతమంది ఉన్నారనే వివరాలను పూర్తిస్థాయిలో సేకరించలేకపోయాం. దీంతోనే ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఇప్పటి వరకూ మాకు ఒక్క రూపాయి నిధులు అందలేదు. మళ్లీ సర్వే చేయించి పూర్తిస్థాయి వివరాలు తెప్పిస్తాం. ఎస్సీ, ఎస్టీలంతా మీటర్లు అమర్చుకుంటే ఉచిత విద్యుత్‌ను అందిస్తాం. అందరూ చైతన్యంతో మీటర్లు అమర్చుకోవాలి.
అన్నీ ఒట్టిమాటలే!
Published Wed, Jan 1 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement