నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఎన్నికల కోడ్ నేపథ్యంలో మూడు నెలలుగా అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించాయి. బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు పనులను ముందుకు సాగించని పరిస్థితి. ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేసినా పనులు జరిగే అవకాశం కల్పించడం లేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ తుది అంకానికి చేరుకోవడమే ఇందుకు కారణం. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖజానాలో సేవలు బంద్ కానున్నాయి. నూతన రాష్ట్రంలో కొత్త అకౌంట్లు తెరిచే వ రకు నిధుల విడుదల, పనులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. విభజన నేపథ్యంలో ఖజానా శాఖలోనూ పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
కొన్ని బిల్లులకే ప్రాధాన్యం
రాష్ట్ర విభజన జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. గతంలో మంజూరైన నిధులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంతో పాటు ఖజానా శాఖ కూడా రెండుగా విడిపోతుండడంతో ఈ శాఖ సేవలను 24వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేయనున్నారు. జూన్2న కొత్త రాష్ట్రం ఏర్పాటై నూతన అకౌంట్లు తెరవడంతో పాటు నిధులు జమయ్యేవరకూ కనీసం 10 రోజుల పాటు ఖజానా సేవలు స్తంభించిపోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అందిన బిల్లుల చెల్లింపుల్లో ఆ శాఖ సిబ్బంది రేయింబవళ్లు బిజీగా ఉన్నారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పంచాయతీరాజ్, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన నియోజక వర్గాల అభివృద్ధి పనుల బిల్లులు, డైట్, కాంట్రాక్ట్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ తదితర ప్రభుత్వ పరమైన బిల్లులన్నీ నిలిచిపోయాయి.
జీతాల చెల్లింపులకే..
ఖజానా శాఖ ఉన్నతాధికారులు జీతాల చెల్లింపులకే జిల్లాల వారీగా సమయం కేటాయిస్తున్నారు. కేటాయించిన సమయాల ప్రకారం ఆయా జిల్లాలవారు జీతాలకు సంబంధించిన బిల్లులను ఆన్‌లైన్‌లో ఖజానా శాఖకు సమర్పించాలి. వీటికి సంబంధించిన టోకెన్ రిలీజ్ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో సీడీపీఓ, ఎంపీ ల్యాండ్స్ పంచాయతీరాజ్, ఇతర శాఖల పనులకు సంబంధించి సుమారు రూ. 35 కోట్లు బిల్లులు నిలచిపోయాయి. కొత్త రాష్ట్రం ఏర్పడే వరకు వీటిని చెల్లించే పరిస్ధితి కనిపించడం లేదు. కనీసం ఉద్యోగి, ఫించన్‌దారు మరణించిన సందర్భంలో దహన సంస్కారాలకు ఇవ్వాల్సిన నగదు కూడా చెల్లించే అవకాశం లేదు.
ఖజానా చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు
ఈనెల 24వ తేదీ లోపు ఆర్థిక లావాదేవీలు ముగించాల్సి ఉండటంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు తమ జీతభత్యాలు, బకాయిలు, ఇతర బిల్లులు మంజూరు చేయించుకోనేందుకు ఖజనా కార్యాలయం చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా మంది సిబ్బంది బిల్లులు కట్టడం తెలియక సతమతవుతున్నారు. ఇదిలా ఉంటే అష్టకష్టాలు పడి బిల్లులు తయారు చేసి ట్రెజరీ తీసుకువస్తే అక్కడ సర్వర్లు మొరాయించడం, ఆన్‌లైన్లో జమకాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా వివిధ శాఖల ఉద్యోగులు బిల్లుల కోసం ఖజనా వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఉద్యోగుల కుదింపు
విభజన నేపథ్యంలో ఖజానా శాఖలో పలు మార్పులు చేర్పులు చొటుచేసుకోనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈశాఖ పరిధిలో 24మంది డిప్యూటీ డైరక్టలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతం వారే. వీరంతా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు ఆప్షన్ ఇస్తే ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ఏటీఓ, డీటీఓ కేడర్ అధికారులకు రివర్షన్ తప్పదు. అలాగే ఈ శాఖనుంచి ప్లానింగ్, అకౌంట్స్ తదితర శాఖల్లో ఫారెన్ సర్వీసుల్లో ఉన్న సిబ్బంది తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఒక డీటీ, ఒక ఏడీ, అయిదుగురు ఏటీఓలు, 29 మంది ఎస్‌టీఓలు, 55 మంది సీనియర్, 25 మంది గణాంకకులు ఉన్నారు. ఇప్పటి వరకు వేర్వేరు శాఖాధిపతులుగా ఉన్నవారు ఒక శాఖలోకి వస్తే కొందరు అధికారులు తగ్గిపోయి కొత్త సమస్యలు తలెత్తనున్నాయి. పైగా సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
అర్ధరాత్రి వరకు పనులు చేస్తున్నాం
చెల్లించాల్సిన బిల్లులు కోట్లలో ఉన్నాయి. వీలైనంత వరకు ఫైళ్లు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సిబ్బంది కొరత సమస్యగా మారింది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాం.
ఎన్. రుద్రప్రతాప్, డిప్యూటీ డెరైక్టర్, ఖజానా