- ఐదేళ్ల తరువాత పెరుగుతున్న పాజిటివ్ కేసులు
- వాతావరణంలో మార్పులతో విషజ్వరాలు
- కలుషిత నీటితో అతిసార ప్రమాదం
కొయ్యూరు: కారణం తెలియదు.. ఐదేళ్ల తరువాత మన్యంలో మలేరియా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇన్నాళ్లు అదుపులో ఉందని భావించిన అధికారులకు పెరుగుతున్న మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడో ఇచ్చిన దోమతెరలు పాడైపోవడం ఒక కారణమైతే.. ఉన్నా వాటిని వాడకపోవడం మరో కారణం. ఇక మన్యంలో మారుతున్న వాతావరణం కూడా ఇందుకు కారణమవుతోంది. వారంరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడా మరణాలు లేకపోయినా విషజ్వరాల లక్షణాలతో జనం విలవిల్లాడిపోతున్నారు. మలేరియా పాజిటివ్ కేసులు కూడా దీనికి తోడవుతున్నాయి. ఒక్క రాజేంద్రపాలెం పీహెచ్‌సీలోనే ఈ నెలలో 35 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండలం మొత్తంగా ఈ సంఖ్య 50 దాటింది. పీవీలు కంటే పీఎఫ్‌లు అధికంగా ఉంటున్నాయి. పీఎఫ్‌కు మూడు రోజుల చికిత్స అయితే పీవీకి 15 రోజుల వరకు మాత్రలు వేసుకోవలసి ఉంటుంది. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
పొంచి ఉన్న అతిసార ప్రమాదం
ఎండల తీవ్రతతో తాగునీటి వనరులు అడుగంటిపోతున్నాయి. కాలువల్లోని కలుషిత నీటిని తాగుతున్నారు. ఈ నీటిలో పడిన ఆకులు కుళ్లిపోయి విషంగా మారే ప్రమాదం ఉంది. ఈ కారణంగా అతిసార ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే ఎండలకు కాచి చల్లార్చిన నీటిని తాగేందుకు జనం ఇష్టపడడం లేదు.ఎలా తీసుకెళ్లిన నీటిని అలానే తాగుతున్నారు. మారుమూ ప్రాంతాల్లో ఇదే వారి పాలిటశాపంగా మారుతోంది. రోగాల బారిన పడుతున్నారు. ఇదే విషయాన్ని నర్సీపట్నం క్లస్టర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాత వద్ద ప్రస్తావించగా అడుగంటిన కాలువ నీటిని తాగరాదన్నారు. మరగబెట్టి చల్లార్చిన నీటిని తాగడం మేలన్నారు. ఇక మలేరియా పాజిటివ్‌లు వచ్చిన చోట మూడు రోజుల వరకు దగ్గరుండి సిబ్బంది చికిత్స చేస్తున్నారని చెప్పారు.
ప్రబలుతున్న మలేరియా
Published Mon, May 25 2015 5:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement