మండపేట : ఎండల తీవ్రతతో కుదేలైన కోళ్ల పరిశ్రమకు ప్రస్తుతం గుడ్డు ధర ఆశాజనకంగా ఉండటం ఊరటనిస్తోంది. ఎగుమతులతో పాటు స్థానిక వినియోగం పెరిగి రైతు ధర పుంజుకుంటోంది. మార్కెట్ పోకడ దృష్ట్యా గుడ్డు ధర రైతు వద్ద రూ.4.25కు చేరే అవకాశం ఉందని పౌల్ట్రీవర్గాలు భావిస్తున్నాయి.
ఎగుమతులతో పాటు స్థానిక వినియోగం తగ్గడం, సెలవుల కారణంగా హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడడం వల్ల వేసవిలో రైతు వద్ద గుడ్డు ధర పతనమైంది. ఏప్రిల్ నుంచి మే నెలాఖరు వరకు రూ.2.24 నుంచి రూ. 2.95 మధ్య పడుతూ లేస్తూ ఉన్న గుడ్డు రైతు ధర జూన్ ప్రారంభం నుంచి వేగంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జిల్లా నుంచి పశ్చిమబెంగాల్, అస్సాం, బీహార్ తదితర రాష్ట్రాలకు గుడ్ల ఎగుమతులు పెరిగాయి. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు తెరవడం, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో స్థానికంగానూ గుడ్లు వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో గుడ్డు ధర రైతువద్ద పెరుగుతూ శుక్రవారం నాటికి రూ.3.94లకు చేరుకుంది. ఇది మరింత పెరిగి రూ.4.25 వరకు చేరే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి.
జిల్లాలోని పౌల్ట్రీల్లో సుమారు 1.30 కోట్ల కోళ్లు ఉండగా రోజుకు కోటీ 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 65 శాతం గుడ్లు బీహార్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రతతో 20 శాతం మేర ఉత్పత్తి పడిపోగా, రోజుకు లక్ష వరకు కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఆ రకంగా జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. వేసవి నష్టాలను కొంత భర్తీ చేసుకునేందుకు ప్రస్తుత ధర దోహదపడుతుందని కోళ్ల రైతులు భావిస్తున్నారు.
కూరగాయలతో పాటు అపరాల ధరలు మండిపడుతున్న తరుణంలో మంచి ప్రత్యామ్నాయంగా ఉన్న కోడిగుడ్డు రేటు కూడా ఇప్పుడు వాటి సరసన చేరిపోరుుంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే పౌష్టికాహారంగా కోడిగుడ్లను సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు రూ.ఐదు వరకు, కొన్ని చోట్ల రూ.5.50 వరకు కూడా అమ్ముతుండటంతో సామాన్యులకు కొనడం భారమవుతోంది.
రైతు ధర ఆశాజనకంగా ఉంది..
గుడ్ల ఎగుమతులు, స్థానిక వినియోగం పెరగడంతో రైతు ధర ఆశాజనకంగా ఉంది. వేసవి నష్టాలను కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఈ ధర ఉపకరిస్తుంది. అయితే ధర ఏడాదిలో సగటున రూ.3.25 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది.
- పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి
రైతుకు ధరహాసం
Published Sat, Jun 20 2015 2:09 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM
Advertisement
Advertisement