ఐ లవ్ ఇండియా
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వెయ్యి మీటర్లతో రూపొందించిన జాతీయ పతాక ప్రదర్శన విశాఖవాసులను ఆకట్టుకుంది. 104 ఏరియాకు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు గురువారం మర్రిపాలెం నుంచి ఎన్‌ఏడీ కొత్తరోడ్ వరకూ పొడవైన పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. - సాక్షి, విశాఖపట్నం
స్వాతంత్య్ర పోరాటం చరిత్ర పుటల్లో విశాఖ జిల్లాకు సముచిత స్థానముంది. దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో జిల్లావాసులు కూడా నడుం బిగించారు. అధిక సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా బరిలోకి దూకారు. టర్నర్ సత్రం, పూర్ణాథియేటర్, హిందూ రీడింగ్‌రూమ్, రెల్లివీథి రామాలయం సమావేశాలకు వేదికలుగా నిలిచాయి. ఉప్పుపై కప్పం విధించడంతో దేశవ్యాప్తంగా గాంధీజీ నాయకత్వంలో ఉప్పుసత్యాగ్రహం జరిగింది. ఇందులో భాగంగానే 1930 ఏప్రిల్ 13న విశాఖ సముద్రతీరంలో ఆందోళన నిర్వహించారు.
ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన నారాయణశర్మ, తెన్నేటి విశ్వనాథం, దిగుమర్తి రామస్వామి, కొల్లూరి సూర్యనారాయణగుప్తలు అరెస్టయ్యారు. తరువాత మేలో గాజువాక బలచెరువు ఉప్పు గల్లీల వద్ద రెండో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. దీనితో జగన్నాధరావు, కందాళ సర్వేశ్వరశాస్త్రి, మల్లవరపు వెంకట కృష్ణారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో బృందంగా ఉద్యమం నిర్వహించిన జానకీబాయమ్మ, బిజెగుప్త, దేవులపల్లి గణపతిరావుతో సహా 20 మంది అరెస్టయ్యారు.
మహాత్ముడు అడుగిడిన వేళ..
హరిజనోద్ధరణ లక్ష్యంతో గాంధీజీ దేశంలో యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన 1933 డిసెంబర్ 29న విశాఖ వచ్చారు. సముద్రతీరంలో జరిగిన సభకు ప్రజలు నీరాజనం పట్టారు. సభ తరువాత ఇప్పటి ఏవీఎన్ కళాశాల దరి రెల్లివీథిలోని రామాలయంలోకి గాంధీజీయే స్వయంగా హరిజనులను ఆలయ ప్రవేశం చేయించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించడానికిగాను 1930లో విశాఖలో తొలి రాష్ట్ర స్థాయి రాజకీయ సమావేశం పూర్ణా థియేటర్‌లో జరిగింది. సమావేశంలో పాల్గొన్న వారికి టర్నర్ చౌల్ట్రీలో బస ఏర్పాటు చేశారు. విదేశీ వస్తువుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా 1932 జనవరి 11న సముద్రతీరంలో విదేశీ వస్తువులను తగులబెట్టారు.
- విశాఖపట్నం
అనకాపల్లి మదిలో గాంధీజీ
అనకాపల్లి: పట్టణంలో అడుగడుగునా మహాత్మ గాంధీ స్మృతులు కదలాడుతూ ఉంటాయి. ఒక వీధి పేరు గాంధీనగరం. పాత బెల్లం మార్కెట్‌కు గాంధీ పేరు పెట్టారు. ఇప్పుడు బెల్లం మార్కెట్ రింగ్‌రోడ్‌కి తరలిపోవడంతో ఇప్పుడున్న కూరగాయల మార్కెట్‌ను గాంధీ పేరుతో పిలుస్తుంటారు. 75 ఏళ్ల నుంచి గాంధీ ఖద్దరు సొసైటీని అనకాపల్లిలో నిర్వహిస్తున్నారు.
ఏఎమ్‌ఏఎల్ కళాశాలలో మహాత్మాగాంధీ నిలువెత్తు విగ్రహం మకుటాయమానం. జాతిపితతో అనకాపల్లి వాసులకు ఎంతో అనుబంధం. గాంధీజీ ఈ పట్టణానికి నాలుగుసార్లు విచ్చేశారు. మొదటిసారి 1921 మార్చి 31వ తేదీన స్వరాజ్యయాత్రలో భాగంగా వచ్చారు. బెజవాడలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి గాంధీజీ హాజరైన సందర్భంగా అనకాపల్లి మీదుగా రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో భాగంగా అనకాపల్లి స్టేషన్‌కు చేరుకున్న గాంధీకి పట్టణ ప్రజలు తిలక్ స్వరాజ్య నిధికి 200 రూపాయలు వసూలు చేసి అందించారు.
* 1929 మే 1న గాంధీజీ ఖద్దరు యాత్రను పురస్కరించుకొని అనకాపల్లికి విచ్చేసారు. ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నం నుంచి అనకాపల్లికి చేరుకున్న గాంధీజీ రాత్రి వరకు ఇక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
* 1933 డిసెంబర్ 29న గాంధీజీ విజయనగరం మహారాజావారి రోల్స్‌రాయిస్ కారులో ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. మార్కెట్ స్క్వేర్ గాంధీబజార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనగా వేలాదిమంది హాజరయ్యారు.
* 1946 జనవరి 20వ తేదీన సాయంత్రం 3.45కి అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు గాంధీజీ చేరుకున్నారు. గాంధీజీ హిందీ నిధికి ఎం.జి. కన్నయ్యపంతులు 1000 రూపాయలు విరాళం సమర్పించారు. అనకాపల్లిలో గాంధీజీ మౌనవ్రతం పాటించారు.
మన్యం వీరుడు... మండే సూరీడు...
దేశభక్తిని రగిల్చాడు.. వలస పాలనపై నిప్పు రాజేశాడు.. తెల్ల దొరల గుండెల్లో నిద్రపోయాడు.. స్వాతంత్య్ర సాధనకు ప్రాణాలిచ్చాడు.. మన్యం వీరుడు.. మండే సూరీడు.. మన అల్లూరి సీతారామరాజు.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమర దిక్కును చూపించిన విరోచిత యోధుడాయన. బ్రిటిష్ అధికారుల ఆగడాలపై తిరుగుబావుటా ఎగురవేశాడు. గిరిజనుల్లో విప్లవాగ్నిని రగిలించాడు. 1917లో గొలుగొండ తాలుకాలో భూపతి అగ్రహారం వద్ద కాలు మోపిన అల్లూరి బ్రిటిష్ అరాచకాలను తిప్పికొట్టాలని భావించాడు.
అదే సమయంలో తహశీల్దారులుగా పనిచేస్తున్న బాస్టీన్ గిరిజనులను రోడ్డు పనుల పేరిట ఇబ్బందులకు గురిచేశాడు. 1922 ఆగస్టు 22-27 మధ్య రామరాజు గాం గంటన్నదొర, మల్లుదొరతో కలిసి ఐదు పోలీసు స్టేషన్లపై దండెత్తాడు. కేడీ పేట, రాజవొమ్మంగి, రంపచోడవరం, అడ్డతీగల స్టేషన్లపై దాడులు చేసి అక్కడ ఆయుధాలను పట్టుకుపోయాడు.1922 సెప్టెంబర్‌లో అల్లూరి దావాణాపల్లి ఘాట్ వద్ద బ్రిటిష్ అధికారులు హైటర్, విలియమ్‌లను హతమార్చాడు. దానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారులు పెద్దగెడ్డ లింగాపురం వద్ద 13 మంది గిరిజనులను చంపి వారి మృతదేహాలను ఊరేగించడం ద్వారా భయపెట్టాలని ప్రయత్నించారు. 1924 మేలో మేజర్ గూడాల్ చేతిలో అల్లూరి ప్రాణాలు విడిచాడు. - కొయ్యూరు