ఉద్యోగుల సౌకర్యార్థం ఏపీఐఐసీ నిర్ణయం
2వేల ఎకరాల్లో ఇంటి నిర్మాణాలు
కలెక్టర్ చొరవతో మొదటిసారిగా ఓర్వకల్లులో ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పనిచేసే చోటనే నివాసం.. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది సర్వసాధారణం. అయితే, ఇక మీదట జిల్లాలో ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది సాధ్యం కానుంది. ఫ్యాక్టరీకి సమీపంలోనే ఉండే ఇంటిలో నివసించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. జిల్లాలోని ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక హబ్‌లో.... రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) 2 వేల ఎకరాలను ప్రత్యేకంగా ఇంటి నిర్మాణాల కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణం కోసం గంటల సమయం వృథా కాకుండా ఉండటంతో పాటు పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కూడా సౌకర్యంగా ఉండనుంది.
ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం
ఓర్వకల్లు వద్ద సుమారు 30 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్‌ను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పలు పరిశ్రమలకు కూడా భూమి కేటాయింపులు జరిగాయి. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 2 వేల ఎకరాలు కేటాయించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. తద్వారా ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా అక్కడనే ఇళ్లను నిర్మించనున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏపీఐఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేవలం ఓర్వకల్లులోనే కాకుండా తంగెడంచె, జూపాడు బంగ్లాలో కూడా ఏర్పాటయ్యే పరిశ్రమలల్లో పనిచేసే వారికి ఈ సౌకర్యం కల్పించనున్నారు. పారిశ్రామిక హబ్‌లో హౌసింగ్ కాంప్లెక్స్ కూడా ఉండాల్సిందేనని ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి... ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌లో భాగం చేసే విధంగాా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
పారిశ్రామిక హబ్‌లో హౌసింగ్ కాంప్లెక్స్
Published Fri, Mar 11 2016 3:13 AM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM
Advertisement