
పరిశ్రమల పరుగు!
రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చిత వాతావరణంతో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడుతున్నారు.
* వెనక్కుపోయిన 1,824 పరిశ్రమలు
* దూరమైన రూ.1.31 లక్షల కోట్ల పెట్టుబడులు
* రూ.5వేల కోట్ల ఆదాయ పన్నుకు గండి
* 3.01 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దూరం
* హైదరాబాద్‌కు పెరిగిన వలసలు
* ఏటికేడాదికి తగ్గిపోతున్న విదేశీ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చిత వాతావరణంతో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు చెన్నై, ముంబై నగరాలవైపు చూస్తున్నారు. ఆదాయం పన్ను శాఖ కేంద్ర కార్యాలయానికి సమర్పించిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఐటీ వసూళ్లు దేశంలో నాలుగో స్థానానికి చేరతాయని తొలుత భావించారు. కానీ, మూడేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి మందగించడంతోపాటు పెట్టుబడులు వెనక్కు తగ్గాయి. ఫలితంగా రూ. 36 వేల కోట్ల ఆదాయం పన్ను వసూళ్ల లక్ష్యంలో దాదాపు రూ. 5 వేల కోట్లకు గండిపడింది.
మూడేళ్లకు ముందు రాష్ట్రంలో 7,632 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిల్లో 1,824 వెనక్కు పోయాయి. విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రంలో నెలకొన్న అభద్రతాభావం వల్ల చెన్నై, ముంబై నగరాలను ఎంచుకున్నారు. పర్యవసానంగా రాష్ట్రానికి రూ. 1,31,538 కోట్ల మేర పెట్టుబడులు దూరమయ్యాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. పారిశ్రామిక వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 3.01లక్షల మందికి ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయి.
గడచిన రెండేళ్లుగా రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు మరీ దిగజారిపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనికితోడు హైదరాబాద్ నగరానికి వలసలు విపరీతంగా పెరిగాయి. 2001లో గ్రామీణ ప్రాంతాల నుంచి 27.3 శాతం మంది వలసరాగా, ఇది 2011 నాటికి 33.49, 2013 మార్చి నాటికి 42 శాతం దాటింది. హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమలు వెలిసి ఉంటే, వాటి అనుబంధ సంస్థలు విస్తరించేవి. దీనివల్ల నగరాలకు వలసలు కొంతైనా తగ్గేవని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇక విదేశీ పెట్టుబడులు ఏటికేడాదికి కుదించుకుపోయాయి. 2006లో రూ. 2,518 కోట్లు ఉండగా, 2007లో రూ. 3,185, 2008లో రూ. 6,203 కోట్లున్నాయి. 2009 నుంచి తిరోగమనం మొదలైంది. 2009లో రూ. 5,400 కోట్లు, 2010లో రూ. 5,753, 2011లో రూ. 4,039, 2012లో 3,790 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఇది రూ. రెండువేల కోట్లు దాటలేదని ఆదాయం పన్ను శాఖ తన నివేదికలో పేర్కొంది. పెట్టుబడులు తగ్గడం, వ్యాపార లావాదేవీలు సరిగా లేకపోవడంవల్లే రాష్ట్రంలో ఆదాయం పన్ను వసూళ్లు తగ్గినట్టు తెలిపారు.