పరిశుభ్రత లోపం వల్లే శిశు మరణాలు | Infant mortality due to lack of hygiene | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత లోపం వల్లే శిశు మరణాలు

Published Mon, Jan 12 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

పరిశుభ్ర వాతావరణం లేకపోవటం వల్లే కాన్పు సమయాల్లో ఇన్‌ఫెక్షన్లు సోకి ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 63 మంది చనిపోతున్నారని స్వచ్ఛభారత్ ఏపీ...

గుంటూరు మెడికల్ : పరిశుభ్ర వాతావరణం లేకపోవటం వల్లే కాన్పు సమయాల్లో ఇన్‌ఫెక్షన్లు సోకి ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 63 మంది చనిపోతున్నారని స్వచ్ఛభారత్ ఏపీ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ ఎం.గోపీచంద్ అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని శుశ్రుత హాలులో రోగుల సహాయకులు, వైద్య సిబ్బందికి ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత నర్సులు, శానిటరీ సిబ్బందిదేనని చెప్పారు.

రోగుల సహాయకులు, వైద్య సిబ్బంది పాటించాల్సి జాగ్రత్తల గురించి వివరించారు. పరిశుభ్రత పెంచేందుకు ప్రతి నెలా ఒక్కో అంశంపై ఆస్పత్రి సిబ్బంది కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆస్పత్రి సిబ్బందితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేరుుంచారు. విజయవాడకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న కార్యక్రమాలతో ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయన్నారు.

అన్ని అనర్ధాలకు పారిశుద్ధ్య లోపమే కారణమని చెప్పారు. వ్యాధులు వచ్చాక బాధపడి డబ్బు ఖర్చుపెట్టడానికి బదులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రజలు, సిబ్బంది సహకారం లేకపోతే పారిశుద్ధ్యం మెరుగుపడదన్నారు.

డాక్టర్ పార్థసారథి, డాక్టర్ సురేష్, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ కృష్ణప్రసాద్ తదితరులు పారిశుద్ధ్యం మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీనివాసులు, ఏడీ మల్లి ఉదయ్‌భాస్కర్, నర్సింగ్ సూపరింటెండెంట్ కె.పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.
 
జీజీహెచ్ సిబ్బందిపై ఆగ్రహం
‘ప్రభుత్వం నెలకు రూ.30 వేలకు పైగా వేతనం ఇస్తోంది.. బాత్రూమ్స్‌లో మూడునెలలుగా నీటిసౌకర్యం లేకపోతే రోగులు వాటిని ఎలా వినియోగిస్తారు? మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత లేదా?’ అని డాక్టర్ గోపీచంద్ జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పావతి, స్టాఫ్ నర్స్ కళ్యాణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లను నిలదీశారు. జీజీహెచ్ లోని చిన్నపిల్లల వైద్యవిభాగం, డాక్టర్ పొదిలి ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ అండ్ ట్రామాకేర్ సెంటర్లలో ఆయన తనిఖీలు నిర్వహించారు.

పిల్లల వార్డులో వాష్‌బేషిన్స్ లేవని గుర్తించి వాటిని ఏర్పాటు చేయించాలని సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావుకు సూచించారు. పీడియాట్రిక్ విభాగాన్ని పెలైట్ ప్రాజెక్టుగా స్వీకరించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ట్రామాకేర్ సెంటర్‌లోని మరుగుదొడ్లలో కనీస వసతులు, ట్యాంకులు సక్రమంగా లేకపోవడం, నీటివసతి లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పురుగు మందు సేవించిన వారి కడుపు శుభ్రం చేసే గది అపరిశుభ్రంగా ఉండటం చూసి శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌పై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement