ఒంగోలు టౌన్ : ‘రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఓ పథకం ప్రకారం పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోంది. సకాలంలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. జిల్లాలో గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు 25 కోట్ల రూపాయల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టలేదు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున ఉద్యమించనున్నాం’ అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్ పేర్కొన్నారు. స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీలకు రూ.3 కోట్ల 50 లక్షలు, బీసీలకు రూ.14 కోట్లు, ఈబీసీలకు రూ.7 కోట్ల 63 లక్షలు, ఎస్టీలకు రూ.60 లక్షల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోయిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో దానిపై ఆధారపడిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్కాలర్‌షిప్‌లు కూడా చెల్లించకపోవడంతో ఎక్కువ మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆధార్ అనుసంధానం విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సగం ఏడాది గడిచిన తరువాత ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బడి పిలుస్తోంది అంటూ ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించడం తప్పితే వాటిలో కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేకుండా పోయిందని విమర్శించారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని, ఆధార్‌తో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని, పాఠశాలలు, వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు రఘురామ్ వెల్లడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పీ కిరణ్, నాయకులు పీ రాంబాబు, రాజేంద్ర పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు
Published Thu, Nov 6 2014 3:40 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement