ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంలా పరిణమిస్తోంది. ప్రభుత్వం రోజుకో నిబంధన మారుస్తూ ఉన్నపళంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లు విద్యా సంవత్సరం మధ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా..ప్రభుత్వం వాటిని మంజూరు చేయకపోవడం, కొత్త విధానాలు ని‘బంధనాలు’
ప్రవేశపెడుతుండటం విద్యార్థులను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ఆధార్‌తో పాటు బయోమెట్రిక్ పరికరాలు వినియోగించుకొని విద్యార్థుల హాజరు నమోదు చేయాలని, వాటి ఆధారంగానే దరఖాస్తులు పంపాలని కళాశాలలను ఆదేశించడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. తాజాగా మరో నిబంధన పెట్టారు. విద్యార్థుల దరఖాస్తుల మీద బార్‌కోడ్ ఉంటుంది. దీన్ని కంప్యూటర్‌లో స్వైప్ చేస్తే విద్యార్థుల వివరాలు ప్రత్యక్షమవుతాయి. అన్ని ధ్రువపత్రాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకుని పంపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నిబంధన అధికారులకు మింగుడు పడటం లేదు.
ఇంత వరకు ఒక్క సంక్షేమ శాఖకు కూడా బార్‌కోడ్ స్కానర్లు అందలేదు. విద్యా సంవత్సరంలో మిగిలి ఉంది రెండు నెలలే కావడంతో కోర్సు పూర్తయ్యే లోపు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందే పరిస్థితి లేదు. జిల్లాలో 396 ప్రైవేటు కాలేజీలుండగా వాటిలో 90 శాతానికిపైగా కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను యాజమాన్యాలు ఏర్పాటు చేయలేదు. ఎప్పుడు ఏర్పాటు చేస్తారో కూడా తెలియదు. దీంతో వేలాది మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేక ఉపకార వేతనాలకు దూరం కానున్నారు.
జిల్లాలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు 11,163 మంది ఉండగా వీరిలో 9,640 మంది విద్యార్థులు మాత్రమే రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా 3,399 మంది నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు.
షెడ్యూల్డ్ తెగలకు చెందిన 1351 మంది విద్యార్థులుండగా 1093 మంది రెన్యువల్‌కు, కొత్తగా 482 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన 15,015 మంది విద్యార్థులుండగా 13,575 మంది రెన్యువల్‌కు, నూతనంగా 5,774 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారు 12,495 మంది ఉండగా 11,125 మంది రెన్యువల్, 2,927 మంది నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 5450 మంది విద్యార్థులుండగా 4,300 మంది రెన్యువల్‌కు, నూతనంగా 367 మంది దరఖాస్తు చేసుకున్నారు.
బోగస్ లబ్ధిదారులను అరికట్టేందుకు విద్యార్థులను గుర్తించేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం సొంత శాఖలతో పాటు, ఇతర శాఖల అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించింది. సొంత శాఖ అధికారి, ఇతర శాఖల అధికారి ఒక్కో రోజు ఒక్కో విద్యాసంస్థను సందర్శించి అతను వాస్తవ విద్యార్థో, కాదో పరిశీలించాలి. ఉపకార వేతనాలను పొందగోరే విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్‌కార్డులు, ఖాతాల సంఖ్య అధికారులకు అందజేయడం, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. అనేక మంది విద్యార్థులకు ఆధార్‌కార్డులు లేవు. ఆధార్‌కార్డుల మంజూరుకు శిబిరాలు ఏర్పాటు చేస్తామన్న అధికారులు పత్తాలేరు. అదేవిధంగా జిల్లాలో ఉన్న 79,739 మంది విద్యార్థుల వేలిముద్రలు సేకరించి పూర్తి వివరాలు పంపేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది. ఏదేమైనా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యా సంవత్సరం చివరికి కూడా విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా లేవు.
పేదల ఫీజుకు ని‘బంధనాలు’
Published Sun, Dec 15 2013 4:32 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement