కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో శాంతిభద్రతలను గాడిలో పెడుతున్న తరుణంలో చోటు చేసుకున్న ఎస్పీ రఘురామిరెడ్డి రాజకీయ బదిలీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లాకు చెందిన మంత్రి పట్టుబట్టి ముఖ్యమంత్రి వద్ద పంచాయితీ పెట్టి బదిలీ చేయించడం వివాదాస్పదమవుతోంది. రెండో రోజు మంగళవారం కూడా ఆయన పక్షాన వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధ్యతలు చేపట్టి నాలుగు మాసాలు గడవక మునుపే హైదరాబాద్ సౌత్ జోన్(దక్షిణ మండలం) డీసీపీగా రఘురామిరెడ్డిని బదిలీ చేయడం తెలిసిందే. అయితే ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్ల లోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. సరైన కారణం లేకుండా తనను బదిలీ చేశారంటూ ఎస్పీ న్యాయ పోరాటానికి సిద్ధమవడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఎస్పీ బదిలీ అంశం ఓ కొలిక్కి రానుంది. ఇదిలాఉండగా జిల్లాలో నేర ఘటనల తీరుతెన్నులను అతి తక్కువ సమయంలో అధ్యయనం చేసి అక్రమార్కులకు ఎస్పీ రఘురామిరెడ్డి అడ్డుకట్ట వేయగలిగారు.
ఆయన బదిలీని నిలుపుదల చేయకపోతే జిల్లాలో మట్కా, పేకాట, చీకటి వ్యాపారాలు, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు పేట్రేగి ప్రజా జీవనానికి ఆటంకమవుతాయని సాధారణ జనం మొదలుకొని ఇంజినీర్లు, డాక్టర్లు, ఉద్యోగులు, మహిళలు, విద్యా సంస్థల అధినేతలు డీజీపికి రాష్ట్ర గవర్నర్‌కు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేశారు.
పోలీసు యంత్రాంగంపై రాాజకీయ నాయకుల పెత్తనం లేకుండా నిబంధనలు విధిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని, రాజకీయ దురుద్దేశంతో చేసిన రఘురామిరెడ్డి బదిలీని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వివిధ విద్యా సంస్థల విద్యార్థులు పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బీజేవైఎం నగర అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ బాస్‌కు వీటిని పంపారు. ప్రజా చైతన్యయువజన సంఘం ఆధ్వర్యంలో కల్లూరు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, యువజనులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఎస్పీ బదిలీని ముక్తకంఠంతో ఖండించారు. నిజాయితీకి బహుమానం బదిలీనా అంటూ కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.
న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణలకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సీపీఐ, ఎమ్మార్పీఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు వేర్వేరుగా ఎస్పీ బదిలీకి నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మంత్రి టీజీ స్వార్థ ప్రయోజనాలకు ఎస్పీని బలి చేయడం దుర్మార్గమైన చర్యగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి రాంభూపాల్ చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మట్కా మాఫియాపై ఎస్పీ ఉక్కుపాదం మోపడాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ నాయకులు ఆయనను బదిలీ చేయించారని ముస్లిం డెవలప్‌మెంట్ సొసైటీ, ఆవాజ్ కమిటీలు పేర్కొన్నాయి. నిజాయితీ గల అధికారిని రాజకీయాలకు బలి చేయడం తగదంటూ ఆలూరులో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఎస్పీ బదిలీ నిలుపుదల కోరుతూ లోక్‌సత్తా ఆదోని డివిజన్ కార్యదర్శి సుబ్రమణ్యం శర్మ రాష్ట్ర డీజీపీకి పంపిన ఫ్యాక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాజకీయ కుట్రలో భాగమే ఎస్పీ బదిలీ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ పేర్కొన్నారు.