వినూత్న గ్రామసభలు సఫలమయ్యేనా? | Innovative rural stated? | Sakshi
Sakshi News home page

వినూత్న గ్రామసభలు సఫలమయ్యేనా?

Jan 2 2014 3:19 AM | Updated on Oct 20 2018 6:17 PM

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా జిల్లాలో గురువారం వినూత్నంగా గ్రామసభలు నిర్వహించనున్నారు.

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా జిల్లాలో గురువారం వినూత్నంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామసభల్లో ఓటింగ్ కీలకం కానుంది. ఎవరికైనా పింఛన్, పక్కాగృహం, రేషన్‌కార్డు, బ్యాంక్‌రుణాలు మంజూరు కావాలన్నా, అంతర్గత రోడ్లు నిర్మించాలన్నా గ్రామసభలకు వచ్చిన ఓటర్లు ఓటు వేయాలి.
 
 మెజార్టీ ఓటర్ల నిర్ణయం ప్రకారం పనులు, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు అందుతాయి. 73వ రాజ్యాంగ సవరణ అనుసరించి గ్రామసభలు పక్కాగా జరపాలని కోరుతూ గత ఏడాది నవంబర్ 7న జీఓఎంఎస్ నంబర్ 791ను విడుదల చేసింది. ఈ జీఓను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. గ్రామసభకు అన్నిశాఖలకు చెందిన మండలస్థాయి అధికారులు హాజరు కావాలని, గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రాజకీయాలకతీతంగా గ్రామసభల ద్వారా నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలని కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆచరణలో సాధ్యమయ్యేనా?అధికార, ప్రతిపక్ష పార్టీలు దీన్ని వేదికగా చేసుకుని కలుషితం చేస్తారా అనేది కాలమే జవాబు చెప్పాలి.
 
   గతంలో గ్రామ సభలు ఇలా..
 గతంలో గ్రామసభలు అంటే సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమయ్యేవారు. తమకు అనుకూలమైన ఒకరిద్దరు ప్రజలతో కలిసి  కావాలసిన పనులకు ఆమోదముద్ర వేసుకొనేవారు. కోరం లేకపోయినా సమావేశాలు జరిగేవి. కార్యదర్శి రాజకీయాలకు భయపడి చూసీచూడనట్టు సంతకం చేసేవారు.
 
 ప్రతి పనిపై ఓటింగ్..
  అయితే ఈదఫా అలా కుదరదు. ఓటు హక్కు కలిగిన ప్రజలను మాత్రమే సభకు అనుమతిస్తారు. హాజరైన ప్రజల నుంచి మినిట్స్ పుస్తకంలో సంతకాలు సేకరిస్తారు. సర్పంచ్ సభాధ్యక్షుడిగా, గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా సభను నడిపించాలి. ప్రతి పనిపై ఓటింగ్ నిర్వహించాలి. మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే పనులు, పథకాలు మంజూరు చేయాలి.
 
 వీడియో చిత్రీకరణ
 గ్రామసభల నిర్వహణ వీడియో ద్వారా చిత్రీకరణ జరుగుతుంది. ఫొటోలు తీస్తారు. ప్రతి అంశంపై సభ్యులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలపాలి. చేతులెత్తడం ద్వారా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు గ్రామసభ చర్చించిన అంశాలపై తీర్మానం జరుగుతుంది. ఇలా జిల్లాలోని 940 పంచాయతీల్లో గ్రామ సభలు జరుగుతాయి. ఈ నెల పదో తేదీ వరకు గ్రామ సభలు జరుగుతాయి.
 
 పాలిచర్ల సభకు కలెక్టర్
 తొలిసారిగా చిల్లకూరు మండలం పాలిచెర్లలో గురువారం  జరిగే గ్రామ సభకు కలెక్టర్ హాజరవుతారు. ఆయనతో పాటు జిల్లా అధికారులు హాజరుకానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement