డ్వాక్రా రుణాల రద్దుపై ఇంత వరకు స్పష్టమైన ప్రకటన వెలువడక పోవడంతో పొదుపు సంఘాల సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: డ్వాక్రా రుణాల రద్దుపై ఇంత వరకు స్పష్టమైన ప్రకటన వెలువడక పోవడంతో పొదుపు సంఘాల సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో డ్వాక్రా మహిళలకు దిక్కుతోచడం లేదు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు రుణాల రద్దుపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయలేదు. రుణాల రద్దు అవుతాయనే కొండంత ఆశతో మూడు నెలలుగా డ్వాక్రా మహిళలు రుణ బకాయిలు చెల్లించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బ్యాంక్ రుణాలు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తం 34,657 పొదుపు సంఘాలున్నాయి. వీటికి సంబంధించి 10,237 సంఘాల వారు రూ.64,86,84,000 కోట్లు రుణాలు పొందారు.
ఒక్కో గ్రూపు సభ్యులు రూ.75 వేలు నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు పొందారు. ప్రతి గ్రూపు నెలకు రూ. 10వేలకు పైగా రికవరీ చేయాల్సి ఉంది. గత మూడు నెలలుగా రికవరీ కాలేదు. పెద్ద మొత్తంలో బ్యాంక్‌లకు జమకాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం 10 శాతం కూడా రికవరీ జరగలేదని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య బ్యాంకులు ఎక్కువ శాతం రైతు, డ్వాక్రా రుణాలు మంజూరు చేశాయి. డ్వాక్రా మహిళలకు గరిష్టంగా రూ. 5లక్షల వరకు రుణాలు ఇవ్వడంతో ప్రతి మహిళ పెద్ద మొత్తంలో రుణాలు పొందింది. దీనికి తోడు రైతు రుణాలు రద్దు అవుతాయని తెలిసి వారు కూడా రుణాలు చెల్లించలేదు.
నిలిచిన టర్నోవర్
బ్యాంక్‌ల్లో పెద్ద ఎత్తున టర్నోవర్ నిలిచిపోయింది. రుణాలు రద్దుపై ఎలాంటి సమాచారం వస్తుందోనని బ్యాంకర్లు ఎదురు చూస్తున్నారు. రుణాలు రద్దు విషయంలో నిబంధనలు లేకుండా ఉంటే సంతోషిస్తామని, గడువు మీరిన రుణాలకే రద్దు వర్తిస్తే మిగిలిన వారు చెల్లించే పరిస్థితి లేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
బ కాయిల వసూలపై ఒత్తిళ్లు
డ్వాక్రా సంఘాల సభ్యులు తమ పొదుపు డబ్బులు మాత్రమే చెల్లించి తీసుకున్న బకాయిలను జమ చేయడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రిజర్వు బ్యాంక్ నుంచి తమపై ఒత్తిళ్లు పెరిగాయని బ్యాంకర్లు వాపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీ అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలపై కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.
గాడితప్పే ప్రమాదంలో గ్రూపులు
బ్యాంక్ లింకేజీ రుణాలు పేరుతో ఒక్కో గ్రూపు లక్షల్లో రుణాలు పొందింది. రుణాలు పొందిన మహిళలు ఎక్కువగా కూలినాలి చేసుకుని జీవనం సాగించేవారు. అలాగే చిరు వ్యాపారులు కూడా రుణాలు పొందిన వారిలో అధికంగా ఉన్నారు. వీరంతా క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అటు అధికారులు ఇటు డ్వాక్రా మహిళలు సతమతమవుతున్నారు. రుణమాఫీ వర్తించందంటే ఒకేసారి రుణాలు చెల్లింపు కష్టమవుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రుణాలు చెల్లింపులు గాడి తప్పితే గ్రూపులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. ఒక్కసారి చెల్లాచెదురైన గ్రూపులను తిరిగి ఏర్పాటు చేయాలన్నా, క్రమం తప్పకుండా ఇవ్వాలన్నా కష్టంతో కూడుకున్న పనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కారణంగా జూన్‌లో కూడా చెల్లింపులు జరగే అవకాశం లేదని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు.