
ప్రతిపక్షనేత దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం...
► ఇన్‌పుట్ సబ్సిడీ....బీమా పరిహారం మంజూరు
కడప అగ్రికల్చర్: జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని పంట చేతికి రాక అల్లాడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులతో కలిసి ఆందోళనకు సిద్ధమయ్యారు. రైతులు తిరగబడితే మన పని గోవిందా...అనుకున్న సీఎం బెంబేలెత్తి ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా చెల్లించేందుకు అనుమతులు ఇచ్చారు. 2016–17 పంటల బీమాకు, ఇన్‌పుట్ సబ్సిడీకి లింకు పెట్టి ఒక దాన్ని మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే జిల్లాకు పంట బీమా రూ.76 కోట్లు, ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 44 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఏదో ఒకటే రైతులకు చెల్లించేదని ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై స్పష్టమైన జాబితా తయారు చేసి రైతులకు ఒక్కటే చెల్లించాలని జిల్లాలోని వ్యవసాయాధికారులను, బ్యాంకర్లను ఆదేశించింది. దీనిపై సాక్షి దినపత్రికలో కథనాలువచ్చాయి.
దీనిపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా వీరపునాయునిపల్లె మండలంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.76 కోట్లు, బీమా రూ.44 కోట్లు ఇచ్చి తీరాల్సిందేనని, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయకపోతే కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో సీఎం చంద్రబాబు వెంటనే మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రెండు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇన్‌పుట్ సబ్సిడీ రూ.76 కోట్లు....వాతావరణ బీమా రూ.44 కోట్లు
జిల్లాలో 2016 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం వల్ల వేరుశనగ,వరి, జొన్న, సజ్జ, ఆముదం, కంది, మినుము,పత్తి తదితర 9 రకాల పంటలను సాగు చేశారు. తీవ్ర వర్షాభావంతో దిగుబడులు రాకుండా ఎండి పోయాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నివేదికలను తయారు చేసి రూ.76 కోట్ల పంట నష్టం సంభవించిందని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. దీనిఇ ఆధారంగా ఇన్‌పుట్ సబ్సిడీ (పంటనష్ట పరిహారం) మంజూరైంది.
22 నుంచి రైతు ఖాతాలకు జమ..
జిల్లాలో వివిధ బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమాను ఈనెల 22వ తేదీ నుంచి జమ చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు డి ఠాకూర్ నాయక్ తెలిపారు. ప్రతి రైతు ఖచ్చితంగా ఆధార్‌కార్డు బ్యాంకుల్లో సమర్పించాలని అన్నారు. గతంలో ఇవ్వని రైతులు మాత్రమే కార్డులు ఇచ్చి నమోదు చేయించుకోవాలని సూచించారు.