సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. సంగారెడ్డి మున్సిపల్ భవన నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపణలు వచ్చిన ఏడాది తరువాత అధికారులు స్పందించారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునకగా చెప్పవచ్చు. ‘బీటలు వారిన మున్సిపల్ భవనం’ అనే శీర్షికతో గత ఏడాది సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది.
ఏడాది తరువాత స్పందించిన విజిలెన్స్ అధికారులు మంగళవారం సంగారెడ్డికి వచ్చి మున్సిపల్ కార్యాలయ భవన నాణ్యతను పరిశీలించారు. భవ నంలోని వివిధ భాగాల్లోని స్లాబులో నుంచి నమూనాలను సేకరించారు.
ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము భవన నిర్మాణ నాణ్యతను పరిశీలించేందుకు వచ్చినట్టు తెలిపారు. టెండర్ కాలంలో చూపిన మాదిరిగా స్లాబు వేశారా? లేదా, ఎంబీ రికార్డులో తక్కువ మోతాదులో స్లాబు వేసి ఎక్కువ రికార్డు చేశారని ఫిర్యాదులు వచ్చాయని, వాస్తవాన్ని తెలుసుకునేందుకే తనిఖీలు చేశామన్నారు. తాము సేకరించిన నమూనాలను క్వాలిటీ కంట్రోల్ బోర్డుకు పంపిస్తామన్నారు. ఇసుక, కంకర, సిమెంట్ తగిన మోతాదులో వాడలేదని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భవన నిర్మాణంలో పది శాతం నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్ నుంచి, 15 శాతం నాణ్యత లోపిస్తే అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి, 20 శాతం నాణ్యత లోపిస్తే డిప్యూటీ ఈఈ నుంచి రికవరీ చేస్తామన్నారు. కాగా ఈ భవన నిర్మాణానికి 2005లో రాజీవ్ నగర బాటలో భాగంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2010 సెప్టెంబర్ 30న అప్పటి మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి భవన నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభించారు. అప్పటికే భవనం ఇరు వైపులా బీటలు వారింది. ఈ విషయాన్ని ‘సాక్షి’లో పతాక శీర్షికన ప్రచురించినప్పటికీ అధికారులు ఏడాది తరువాత విచారణకు రావడంపై స్థానికులు వారిపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.