నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా సెలవుపై వెళ్లారు.
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా సెలవుపై వెళ్లారు. అక్టోబర్ 8 వరకు ఆయన సెలవు పెట్టారని సమాచారం. బదిలీలో భాగంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. చీఫ్ సెక్రటరీ ఆదివారం రాత్రి ఫోన్ చేసి సెలవు పెట్టాల్సిందిగా ఆదేశించారని, అందులో భాగమే ఈ ఆకస్మిక పరిణామమని ప్రచారం జరుగుతోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుకు ఆయన స్థానంలో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నగరపాలక సంస్థకు చేరుకున్న ఆయన వివిధ శాఖాధిపతులతో సాయంత్రం ఆరు గంటల వరకు సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రతి సెక్షన్ కలియతిరిగారు. శాఖల వారీగా అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే వీరపాండి యన్ తిరిగి వచ్చే అవకాశం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
విసిగి‘పోయారు’...
గత కొద్ది రోజులుగా కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కింది సిబ్బందిని గాడిలో పెట్టడం కత్తిమీద సాములా తయారైంది. వివిధ విభాగాల్లో పాతుకుపోయిన అవినీతి అనకొండలు పెద్ద సవాల్‌గా తయారయ్యాయి. రాజధాని నేపథ్యంలో నగర సుందరీకరణ, రోడ్ల విస్తరణ, కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో కమిషనర్ వీరపాండియన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు భోగట్టా. దీంతో విసుగుచెందిన ఆయన సాధ్యమైనంత త్వరలో ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోవాలనే ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం సాగింది. ఆకస్మికంగా సెలవుపై వెళ్లడం బదిలీ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. సొంత పనులపై కమిషనర్ స్వగ్రామమైన మధురై వెళ్లారని, తిరిగి వస్తారని పేషీ వర్గాలు చెబుతున్నాయి.