కేడర్ పోస్టుల్లోని ఐఏఎస్‌లను ఇష్టానుసారం బదిలీ చేయడం వల్ల స్థిరత్వం లేక పాలనపై ప్రభావం చూపుతోందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఐఏఎస్ కేడర్ పోస్టులపై కేంద్రం అభిప్రాయం
నేడు రాష్ట్రాల జీఏడీ ముఖ్యకార్యదర్శులతో సమీక్ష
హైదరాబాద్: కేడర్ పోస్టుల్లోని ఐఏఎస్‌లను ఇష్టానుసారం బదిలీ చేయడం వల్ల స్థిరత్వం లేక పాలనపై ప్రభావం చూపుతోందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్‌లను కేడర్ పోస్టుల్లో కనీసం రెండేళ్ల పాటు బదిలీ చేయకుండా ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నా అన్ని రాష్ట్రాల సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులతో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం మంగళవారం ఢిల్లీలో దీనిపై సమీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని సేకరించనుంది. అన్ని రాష్ట్రాల అఖిల భారత సర్వీసు అధికారుల కేడర్‌పై సమీక్ష నిర్వహించనున్నారు.ఐఏఎస్ అధికారుల అనధికారిక గైర్హాజరు, రాష్ట్ర కేడర్ సర్వీసు నుంచి ఐఏఎస్‌లుగా పదోన్నతుల పెండింగ్‌తో పాటు ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం, అఖిల భారత సర్వీసు అధికారులపై ఎంపీలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుల పెండింగ్‌పై ఈ సమీక్షలో చర్చించనున్నారు.
ఈ సమీక్షలో తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యకార్యదర్శికి మాట్లాడే అవకాశం కల్పించారు. కాగా 2012 అక్టోబర్ 17న అప్పటి ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హక్కుల నోటీసు ఇచ్చారు. దీనిపై వాస్తవ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పంపకపోవడంతో ఆ అంశం పెండింగ్ ఉంది. నివేదికను సమీక్షలో కోరనున్నారు. గతేడాది రాష్ట్ర కేడర్ సర్వీసు నుంచి ఐఏఎస్‌ల పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను, ఖాళీలను కూడా పంపలేదు. ఇందుకు రాష్ట్ర విభజన కారణమని ప్రభుత్వం తెలిపింది.