తూప్రాన్, న్యూస్‌లైన్: పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 80 తులాల బంగారం ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ గజరావు భూపాల్ శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. దుబ్బాక మండలం ధర్మరాజిపేట గ్రామానికి చెందిన వెంగళి భిక్షపతి, అలియాస్ చిక్కుడు క్రిష్ణ అనే 25 సంవత్సరాల యువకుడు పదవతరగతి ఫెయిలయ్యాడు.అనంతరం ఎలక్ట్రీషియన్ పని నేర్చుకొని 2005లో సిద్దిపేటలో పనిచేశాడు. ఈ సమయంలోనే కరెంటు మోటర్లు దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు.
ఈ కేసులో మూడు నెలల జైలు శిక్ష సైతం అనుభవించాడు. అనంతరం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ చేసిన కేసులోను జైలుకు పోయాడు. దీంతో అత ని మొదటి భార్యా, రెండవ భార్యా సైతం విడాకులు ఇచ్చి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే భిక్షపతి జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకు అవసరమైన డబ్బుకోసం శివ్వంపేట, తూప్రాన్, నర్సాపూర్, జిన్నారం, రామాయంపేట, చేగుంట, దుబ్బాక, జోగిపేట, సంగారెడ్డి, మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం పూట సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లు గుర్తించి రాత్రి వేళ ఆ ఇళ్లలో దూరి చోరీ చేసేవాడు. చోరీసొత్తును అమ్మగా వచ్చిన సొమ్ములతో కార్లలో తిరుగుతూ జల్సా చేసేవాడు. ఆయా చోరీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు భిక్షపతికోసం గాలించినా అతను దొరకలేదు. అయితే శుక్రవారం ఉదయం భిక్షపతి శివ్వంపేట బస్టాండ్ వద్ద అనుమానస్పదంగా సంచరిస్తుండడంతో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు పట్టుకొని ఎస్‌ఐ నాగేశ్వర్‌రావుకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఎస్‌ఐ అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలు తానే చేసినట్లు భిక్షపతి ఒప్పుకోగా, అతని వద్ద ఉన్న సుమారు 80 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నర్సాపూర్‌లోని ఎంఎం కోర్టుకు పంపారు. విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ రవీందర్‌రెడ్డి, శివ్వంపేట ఎస్‌ఐ నాగేశ్వరరావు, పోలీసులు మున్నానాయక్, గోవర్ధన్‌రావు తదితరులు ఉన్నారు. భిక్షపతిని అదుపులోకి తీసుకుని చాలా చోరీల కేసును ఛేదించిన తూప్రాన్ సీఐ ర వీందర్‌రెడ్డి, శివ్వంపేట ఎస్‌ఐ నాగేశ్వరరావు, ఐడి పార్టీ పోలీసులు గోవర్ధన్‌రావు, మున్యానాయక్‌లకు అదనపు ఎస్పీ ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.
భిక్షపతి...చోరీల్లో ఘనాపాటి
నిందితుడు భిక్షపతి చోరీల గురించి తెలుసుకున్న పోలీసులే నోరెళ్లబెట్టారు. భిక్షపతి తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8.1 తులాల బంగారు ఆభరణాలు, 18.05 తులాల వెండి ఆభరణాలు, శివ్వంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 22 తులాల బంగారు ఆభరణాలు, కిలో 18 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశాడు.
అంతేకాకుండా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 4.05 తులాల బంగారు ఆభరణాలు, వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో 4.05 తులాల బంగారు ఆభరణాలు, 28 తులాల వెండి ఆభరణాలు, చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో 4 తులాల బంగారు ఆభరణాలు, రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 6.05 తులాల బంగారు ఆభరణాలు, దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో 13.05 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలు, జోగిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2.04 తులాల బంగారు ఆభరణాలు, సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2.05 తులాల బంగారు ఆభరణాలు, జిన్నారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 0.05 తులాల బంగారు ఆభరణం, రంగారెడ్డి జిల్లా మేడ్చేల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 0.05 తులాల బంగారం ఆభరణం...ఇలా మొత్తం 80 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. ఈ చోరీ సొత్తును రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో విక్రయించేందుకు వెళ్తున్న క్రమంలోనే పోలీసులకు దొరికిపోయాడు.
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
Published Sat, Sep 7 2013 4:10 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement